ఈ వైద్యడు దేవుడే.. రూ.10 ఫిజుతో కరోనా చికిత్స.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులను అవకాశంగా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం కరోనా లక్షణాలతో ఆస్పత్రికి చేరితే చాలు వివిధ రకాల వైద్య పరీక్షలు అంటూ లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఇక ఆస్పత్రిలో చేరి వైద్యం పొందాలంటే ఉన్న ఆస్తులను సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో కేవలం పది రూపాయల ఫీజుతో కరోనా చికిత్స అందిస్తూ తన సేవా గుణాన్ని చాటుకున్నాడు ఓ వైద్యుడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ జనరల్‌ మెడిసిన్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్‌ చేశారు. వివిధ ఆస్పత్రిలో పనిచేసిన ఇమ్మానియేల్ ప్రస్తుతం సొంత క్లినిక్ నడుపుతున్నాడు. సొంత క్లినిక్ పెట్టినప్పటినుంచి కన్సల్టేషన్ ఫీజు కోసం 200 రూపాయలు వసూలు చేసేవారు. అయితే అతని దగ్గరకు చికిత్స కోసం వచ్చే నిరుపేదలకు, దేశ రక్షణ కోసం శ్రమించే జవానులకు, దేశానికి అన్నం పెట్టే రైతులకు కేవలం పది రూపాయలు తీసుకొని వైద్యం అందిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు తలెత్తడంతో అతని వద్దకు కరోనా చికిత్స కోసం వచ్చే పేషెంట్ల నుంచి కేవలం పది రూపాయలు తీసుకుని ల్యాబ్‌ పరీక్షలు మొదలుకుని మందులు, ఇంజక్షన్‌లు సైతం తక్కువ ధరకే అందిస్తున్నారు. ఇక దివ్యాంగులు నిరుపేదలకి ఉచితంగానే కరోనా వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా అధిక స్థాయిలో వ్యాపించడం వల్ల ఆక్సిజన్, రెమ్‌డెవివిర్‌ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇక సామాన్యులకు అయితే ఇవి అందని ద్రాక్షగా ఉన్నాయి.

ఇలాంటి సమయంలోనే నిరుపేదల కోసం కేవలం రూ.15వేల నుంచి రూ.20లోపే ఆక్సిజన్‌, రెమ్‌డెవివిర్‌ వంటి వైద్య సేవలను అందిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులలో లక్షలు ఖర్చు అవుతుండగా ఇమ్మానియేల్ ఆస్పత్రిలో 15 నుంచి 20 వేల లోపు వైద్యం అందడంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజ్వల క్లినిక్‌కు వస్తున్నారు. ఇంటి దగ్గరే కరోనా వైద్యం చేయించుకునే వారి కోసం ఇంటి వద్దకి నర్సులను పంపిస్తున్నారు. అయితే నర్సులు వచ్చిపోయే రవాణా ఖర్చులను రోగుల భరించాల్సి ఉంటుంది. ఈ విధంగా డాక్టర్ ఇమ్మానియేల్ అతి తక్కువ ధరకే కరోనా చికిత్సను అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు.