బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.