దేశంలోని వాహనదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి అది తప్పనిసరి..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వాహనదారులు జనవరి 1, 2021 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. టోల్ వసూళ్లను ఎలక్ట్రానిక్ విధానంలో వసూలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో కేంద్రం పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం పాత వాహనాలైనా, కొత్త వాహనాలైనా మిహాయింపులు ఉండవని కేంద్రం చెబుతోంది. దేశంలోని అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ విడుదలైంది.

టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ ను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనలను అమలు చేస్తోంది. గతేడాది అక్టోబర్ నెల నుంచి ఫాస్టాగ్ అమలును కేంద్రం తప్పనిసరి చేస్తోంది. అయితే ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసినా ద్విచక్ర వాహనాలకు, మూడు చక్రాల వాహనాలకు, 2017 డిసెంబర్ ‌1 కంటే ముందు కొనుగోలు చేసిన పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపును ఇచ్చింది.

అయితే ఈ నిబంధనలలో మార్పులు చేసి నాలుగు చక్రాల వాహనాలన్నింటికీ వచ్చే సంవత్సరం నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. దీంతో పాటు మరికొన్ని కొత్త రూల్స్ ను సైతం కేంద్రం అమలులోకి తెచ్చింది. 2021 సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి థర్డ్ పార్టీ బీమా కావాలన్నా ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది.