మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

ఈ మధ్య కాలంలో ఫోన్లు పేలిన ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో వినియోగదారులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే ఫోన్లు పేలడానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్లు పేలకుండా జాగ్రత్త పడవచ్చు. మొబైల్ ఫోన్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే అపాయమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్లు వాడకూడదని సూచిస్తున్నారు.

మొబైల్ ఫోన్ ను ఎప్పుడూ 96 శాతం కంటే ఎక్కువగా ఛార్జ్ చేయకూడదని అదే సమయంలో 20 శాతం కంటే ఛార్జింగ్ తక్కువగా ఉండకూడదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ కు ఎప్పుడూ కంపెనీ ఛార్జర్ నే వాడాలని ఒకవేళ కంపెనీ ఛార్జర్ పాడైతే ఖర్చు ఎక్కువైనా కంపెనీ ఛార్జర్ నే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మార్కెట్ లో తక్కువ ధరకు దొరికే ఛార్జర్లను కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు.

మొబైల్ ఫోన్ లో అవసరం లేని అప్లికేషన్లు ఉంటే వీలైనంత త్వరగా తొలగించాలని.. అనవసరమైన యాప్స్ సైతం పలు సందర్భాల్లో మొబైల్ ఫోన్లు పేలడానికి కారణమవుతాయని సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ తీసిన వెంటనే హెవీ గేమ్స్ ఆడకూడదని.. వీడియో కాల్స్ చేయకూడదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ బ్యాటరీ సమస్యలు వస్తే జెన్యూన్ బ్యాటరీనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.

ఫోన్ వర్షంలో తడిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరబెట్టాలని సర్వీసింగ్ చేయించిన తరువాతే ఫోన్ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా కేరళలో ఒక వ్యక్తి దిండు కింద ఫోన్ పెట్టుకున్న సమయంలో ఫోన్ పేలి గాయాలయ్యాయి. ఫోన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.