నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం.. ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్టు చేసిన పోలీసులు

రోజురోజుకు మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయి ఇంటి నుంచి బయటకు కాలు పెట్టింది మొదలు.. జాగ్రత్తగా, భంద్రంగా ఇంటికి వచ్చే దాక నమ్మకం లేకుండా పోతోంది. తల్లిదండ్రులకు ఇలాంటి ఘటనల వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో.. ఓ మహిళా అధికారిపై ఫ్లైట్ లెఫ్టినెంట్‌ లైంగిక దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన మహిళా అధికారిణి(28) కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్స్ ట్రెయిన్ కాలేజీలో కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆట సమయంలో ఆమె గాయపడ్డారు. గాయానికి చికిత్స పొంది, తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అదే కాలేజీలో శిక్షణ పొందుతున్న చత్తీస్‌గఢ్‌కు ఫ్లైట్ లెఫ్టినెంట్ అమరేందర్ (29) ఆమె గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు తొలుత వాయుసేన అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానిక గాంధీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేశారు. నిందిత అధికారిపై సెక్షన్ 376 కింద కేసు నమోదుచేశామని కోయబత్తూరు పోలీస్ అధికారి దీపక్ దమన్ తెలిపారు.

అతడిని పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతామన్నారు. ఇదిలా ఉండగా..ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది సాయుధ దళాల సిబ్బందిని అరెస్టు చేయడం స్థానిక పోలీసుల పరిధిలోకి రాదని తెలిపారు. దానిపై స్పందించిన పోలీసుల అధికారులు అరెస్టు పరిధిపై చర్చ జరుపుతున్నామని తెలిపారు.