కరోనా నిర్ధారణ పరీక్షలలో పలు మార్పులు చేసిన..ఐసీఎంఆర్!

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులపై అధిక ఒత్తిడి కలుగుతుంది. నిజంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షల నిమిత్తం ప్రజలు ఆస్పత్రికి, టెస్టింగ్ సెంటర్ల దగ్గర క్యూ కట్టడంతో టెస్టింగ్ సెంటర్లపై అధిక ఒత్తిడి కలుగుతుంది. ఈ క్రమంలోనే టెస్టింగ్ సెంటర్లపై కలిగే ఒత్తిడిని తగ్గించడం కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక మార్పులు చేసింది.

కరోనా లక్షణాలు కనిపించిన వారిలో ఒకసారి రాపిడ్ యాంటిజన్ టెస్ట్ లేదా ఆర్టీపీసీ ఆర్టెస్టులో ఒకసారి పాజిటివ్ అని తేలిన వ్యక్తి కి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వారికి పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రాగానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు.

అయితే తాజాగా కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే వారికి తిరిగి కరోనా పరీక్షలను నిర్వహించడం అవసరం లేదని ఐసీఎంఆర్ సూచించింది. ప్రస్తుతం అంతర రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కచ్చితం అనే నిబంధన ఉంది . తాజాగా ఐసీఎంఆర్ ఈ నిబంధనలను తొలగిస్తున్నట్లు తెలిపింది.

స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించిన వారు ఏ విధమైనటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండాలని, ఎటువంటి లక్షణాలు లేని వారు మాస్క్ ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఎక్కువగా ర్యాపిడ్ యాంటిజన్ టెస్ట్ లను నిర్వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా కరోనా పరీక్షల విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.