ప్రతి 10 మందిలో ఆరుగురు అందులోనే బతుకుతున్నారు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో వివిధ రకాలకు చెందిన కంపెనీలన్నీ వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. ఈ విధంగా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించడంతో ఎక్కువ శాతం పనులు ఇంటర్నెట్ పైన ఆధారపడి ఉన్నాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది.

కరోనా కేసులు పెరగటం వల్ల పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేశారు.లాక్ డౌన్ వల్ల చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు ఇంట్లోనే గడపడంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది అని చెప్పవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కువ శాతం వారి రోజును ఇంటర్నెట్ లోనే గడుపుతున్నారు. ఇంటర్నెట్ ఉపయోగించి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిలో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు.

ఇక పెద్దవారు అయితే వారికి నచ్చిన సినిమాలను, పుస్తకాలను గురించి కూడా ఇంటర్నెట్ ఉపయోగించి చదువుతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ విధించడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ వినియోగం అధికమైందని చెప్పవచ్చు. ప్రపంచంలో రెండింట మూడు వంతు మంది ప్రజలు మొబైల్ ఫోన్స్ వాడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

ఈ ఏడాది ప్రపంచంలో ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య ఏకంగా 4.72 బిలియన్లకి చేరుకున్నట్టు తెలిపింది. అదేవిధంగా ప్రతి పది మందిలో ఆరు మంది ఇంటర్నెట్ లోనే జీవిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం 13 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తూ ప్రపంచంలోనే రెండవ ఇంటర్నెట్ వినియోగ దేశంగా నిలిచింది. అమెరికాలో అయితే కేవలం 6.3 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు.