రాజమౌళి సినిమాలు రాబోవుతరం వారికి లైబ్రేరిగా మారుతున్నాయి..

స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారిన ఎస్ ఎస్ రాజమౌళి ఈ రోజు పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారతారని ఏ ఒక్కరు ఊహించి ఉండరు. ఆయన కూడా తను ఈ
స్థాయికి చేరుకుంటారని ఊహించి ఉండకపోవచ్చు. సినిమా విషయంలో రాజమౌళి విజన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ విజన్ వల్లే తెలుగు సినిమా ఏంటో బాహుబలి సిరీస్‌లతో చూపించారు. రాజమౌళి సినిమాలు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చేసే ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి ఆయన రేంజ్‌ను పెంచుతూనే ఉన్నాయి.  

తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం, సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్ కెమెరా వర్క్, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్, రమా రాజమౌళి సపోర్ట్ ఇవన్నీ రాజమౌళికి బాగా హెల్ప్ అవుతున్నాయి. ఒక సినిమా కోసం రాజమౌళి ఎంతగా శ్రమిస్తారో ఆయన వద్ద పనిచేసే ప్రతీ ఒక్కరు చెబుతుంటారు. ప్రతీ షాట్ పర్ఫెక్ట్‌గా రావాలని రాజమౌళి పడే తాపత్రయం సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎండింగ్ పూర్తయి, ప్రమోషన్స్ నిర్వహించడం నుంచి సినిమా థియేటర్స్‌లో రిలీజయ్యే వరకు అన్నీ రకాల ప్రయత్నాలు చేసి సినిమా సక్సెస్ కు కారణంగా నిలుస్తున్నారు.  

సినిమా ప్రమోషన్స్ కూడా రాజమౌళి చాలా విభిన్నంగా నిర్వహించడం ప్రత్యేకంగా అందరూ చెప్పుకుంటారు. ఇక బాహుబలి సినిమాతో ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడం వారికి పాన్ ఇండియన్ స్టార్స్‌గా క్రేజ్ తెచ్చిపెట్టడం అంటే అంత ఈజీ కాదనే చెప్పాలి. గతంలో మల్టీస్టారర్ సినిమాలకు ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలకు చాలా తేడాలొచ్చాయి. అప్పుడు ఎన్.టి.ఆర్ – ఏ.ఎన్.ఆర్ లాంటి పెద్ద స్టార్ హీరోలు కలిసి నటిస్తే అభిమానులు పండుగ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతీది ట్రోల్ చేసేందుకే కొందరు యాంటీ ఫ్యాన్స్ తయారవుతున్నారు. హీరోలు బాగానే ఉంటారు.

ఈ విషయం వారు కూడా స్వయంగా వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ మధ్యనే అనవసరమైన ఇగోలు ఉంటున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియా వేదికగా నానా రచ్చ చేస్తున్నారు. ఈ రచ్చలు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారిస్తున్నాయి. స్వయంగా హీరోలు కలగజేసుకుంటే గానీ పరిస్థితులు సద్దుమణగడం లేదు. బాహుబలి, ఇప్పుడు రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలతో మన వాళ్ళు మల్టీస్టారర్ తీస్తే ఇలా తీయాలి అని చెప్పుకునే విధంగా రాజమౌళి తన సినిమాలతో రాబోవుతరానికి తెలిసేలా..నేర్చుకునేలా చేస్తున్నారు.

ఇప్పుడు మల్టీస్టారర్ డీల్ చేసే దర్శకులకు ఆయన సినిమాలే ఓ మోడల్ లైబ్రేరీగా తయారవుతోంది. హీరోల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..ఇద్దరు హీరోలను కథకు ఎంచుకున్నప్పుడు ఎంత బ్యాలెన్స్డ్‌గా కథ రాసుకోవాలి వంటి ప్రధానమైన అంశాలు ఇప్పుడు రాబోతున్న ఆర్ఆర్ఆర్ మూవీతో చెప్పబోతున్నారు. ఇటీవల వచ్చిన నాటు నాటు సాంగ్‌లో ఇద్దరు హీరోలను సమానంగా చూపించారని అర్థమవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అటు నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్ గనక పూర్తి స్థాయిలో శాటిస్‌ఫై అయితే మాత్రం ఇక ఈ సినిమా అందరికీ ఓ గైడెన్స్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని చెప్పవచ్చు.