గ్యాంగ్ లీడర్ సినిమా శతదినోత్సవానికి విజయశాంతి రాకపోవడానికి కారణం అదేనా..!!

‘భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకు అండా..దండా” ‘సండే అననురా మండే అననురా.. ఎన్నడు నీ దానే రా..” సంగీత దర్శకుడు బప్పిలహరి అందించిన పాటలు ఆనాటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి దర్శకుడు విజయబాపినీడు సినిమాల్లోకి రాకముందు ఆయన ఇండియన్ ఫిల్మ్స్, బొమ్మరిల్లు, విజయ, నీలిమకి సంపాదకులుగా పనిచేశారు. ఆయన 1981లో డబ్బు, డబ్బు, డబ్బు అనే చిత్రంతో తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిరంజీవితో పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, మగధీరుడు, హీరో, ఖైదీ నెంబర్ 786, బిగ్ బాస్ చిత్రాలను రూపొందించారు.

గ్యాంగ్ లీడర్ చిత్రం మిగతా సినిమాలతో పోలిస్తే సూపర్ డూపర్ హిట్ అయింది. దర్శకుడు విజయ బాపినీడు తీసిన 22 చిత్రాల్లో చిరంజీవితోనే ఎక్కువ చిత్రాలు నిర్మించారు. 1991 శ్యాం ప్రసాద్ ఆర్ట్స్, విజయబాపినీడు రచన, దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. మురళి మోహన్, శరత్ కుమార్, సుమలత సత్యనారాయణ, రావు గోపాల్ రావు ప్రధాన పాత్రల్లో కనిపించారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సూపర్ హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సినిమా పడింది.

కొండపై నిల్చున్న చిరంజీవిని ఈ సినిమా ఏకంగా శిఖరంపై కూర్చోపెట్టింది. ప్రభుదేవా మాస్టారు సమకూర్చిన నృత్యాలు సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. చిరంజీవి మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కుటుంబ కథతో కూడిన ఈ సినిమాను మాస్ ప్రేక్షకులకు కూడా నచ్చేలా తీసిన ఘనత విజయబాపినీడుకే దక్కుతుంది. తేలికపాటి గడ్డం, డిఫరెంట్ బాడీలాంగ్వేజ్, మేనరిజం డైలాగ్స్.. ఈ చిత్రానికి చిరంజీవిని తప్ప మరొక హీరోను ఊహించుకోలేము. చిరంజీవితో నిర్మించిన ఈ సినిమా విజయదుందుభి మోగించడంతో హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, తిరుపతి నాలుగు చోట్ల గ్యాంగ్ లీడర్ 100 రోజుల ఫంక్షన్ నిర్వహించారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ శతదినోత్సవానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమానికి విజయశాంతి మినహా ఈ చిత్రంలో నటించిన దాదాపు నటీనటులందరూ కూడా హాజరయ్యారు.

ఈ చిత్రంలోని భద్రాచలం కొండ సీతమ్మ వారి అండా..అనే పాట ఊటీలో చిత్రీకరిస్తుండగా కర్తవ్యం చిత్రానికి గాను విజయశాంతికి జాతీయ అవార్డు ప్రకటించారు. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఆమెను అభినందించారు. గ్యాంగ్ లీడర్ చిత్రానికి డిఫరెంట్ లుక్, తనదైన శైలితో చిరంజీవి అంతాతానై నడిపించారు. క్రెడిట్ మొత్తం చిరంజీవికి పోవడం, సినిమా పోస్టర్స్ పై విజయశాంతిని అంతగా ఎలివేట్ చేయకపోవడం లాంటి కారణాలతో విజయశాంతి గ్యాంగ్ లీడర్ శతదినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోయారన్నది ఆనాటి సినీ ప్రముఖుల విశ్లేషణ. మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే విజయశాంతి చిరంజీవితో అత్యధిక చిత్రాల్లో నటించింది. లోగడ వీరి కాంబినేషన్లో వచ్చిన ఏ సినిమా విషయంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తకపోవడం గమనార్హం.