పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’, ‘పంజా’, ‘పులి’ సినిమాలు అందుకే ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి..!

పవన్ కళ్యాణ్ .. ఈ పేరుకి సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి గొప్ప పేరుందో అందరికీ తెలిసిందే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకి మాత్రం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కొంత వరకు ఉపయోగపడింది. కానీ రెండవ సినిమా నుంచి మాత్రం ప్రతీది ఆయన సొంతగానే ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టారు. కథల విషయంలో కొన్నాళ్ళు అన్నయ్యలు చిరంజీవి, నాగ బాబు, అలాగే నిర్మాత అల్లు అరవింద్ సలహాలు తీసుకున్నప్పటికి ఫైనల్ డెసిషన్ మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకుంటూ కథలను ఎంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో వరుసగా సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఒకరకంగా హీరోగా పరిచయమైన ఎవరికీ కెరీర్ ప్రారంభంలో ఇన్ని వరుస హిట్స్ దక్కింది చాలా తక్కువ మందికే అని చెప్పాలి. గోకులంలో సీత రెండవ సినిమాగా, సుస్వాగతం మూడవ సినిమాగా వచ్చి వరుసగా హ్యాట్రిక్ హిట్స్ సాధించాయి. కథ, కథనం పక్కాగా కుదరడంతో బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను అందుకొని స్టార్ హీరోగా మారారు పవన్ కళ్యాణ్. సుస్వాగతం సినిమా సమయంలో పవన్‌కి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ప్రముఖ దర్శక, రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళి పవర్ స్టార్ అని పెట్టారు.

అప్పటి నుంచి స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ వేస్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్‌కి పవర్ స్టార్ అనేది పర్‌ఫెక్ట్‌గా సరిపోయే పేరు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌లో పవర్ స్టార్ అనేది ఆయనకి మాత్రమే సూటయ్యేది. తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ తమ్ముడు, బద్రి సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఇలా వరుసగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అంతేకాదు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కి అసాధారణమైన క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చేశాయి.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 7వ సినిమాగా ఖుషి సినిమా రూపొందించారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు సూర్య తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను కొంతమంది ప్రేక్షకులు, అభిమానులు ఎన్ని వందలసార్లు చూసి ఉంటారో లెక్కలేదు. ఇంత పెద్ద సక్సెస్‌తో పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. అయితే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్‌కి ఫ్లాపులు రావడం మొదలైంది. అల్లు అరవింద్ నిర్మాతగా జానీ సినిమాలో నటించాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో భారీ ఫ్లాప్ సినిమాగా మిగిలింది.

జానీ సినిమాకి పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించాడు. అన్నీ సాంగ్స్ ఆయనే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకి చాలానే ప్రయోగాలు చేశారు. కథ మాత్రం కొత్తదనం లేనిది ఎంచుకున్నాడు. ఇదే సినిమా డిజాస్టర్ అని టాక్ తెచ్చుకోవడానికి కారణమైంది. పైగా పవన్ – రేణు లుక్స్ కూడా జనాలను ఆకట్టుకోలేకపోయాయి. విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ మహిళలను మాత్రం కొంతవరకు జానీ ఆకట్టుకున్నాడు. చెప్పాలంటే ఖుషి లాంటి సినిమా తర్వాత జానీ వచ్చి ఉండాల్సిన సినిమా కాదని చాలామంది అభిప్రాయపడ్డారు.

ఇక పంజా, పులి లాంటి సినిమాలు ఫ్లాపవడానికి కారణం కథా లోపమే. పవన్ నుంచి అభిమానులు, జనాలు ఆ సమయంలో కోరుకున్న కథలు ఇవి కాదు. అప్పటి వరకు ఫ్యామిలీ, యూత్ ఎంటర్‌టైనర్స్‌తో వచ్చి భారీ సక్సెస్‌లను అందుకున్న పవన్ కళ్యాణ్ ఏదో కమర్షియల్ సక్సెస్ కోసం ప్రయోగాలు చేయడం.. దాని కోసం సరైన కథలను ఎంచుకోవడంలో పొరపాటు జరగడం ఈ సినిమాల పరాజయానికి కారణమయ్యాయి. సీరియస్ పాత్రల్లో పవన్ కళ్యాణ్‌ని చూడటానికి జనాలు ఇష్టపడలేదు. చెప్పాలంటే పంజా, పులి సినిమాల మోకోవర్స్ అదిరిపోయాయి. కానీ కథలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.