దర్శకుడిగా రాణిస్తాడనుకున్న కొడుకును.. ఒక్కసారిగా ‘మార్చురి గది’ లో చూసేసరికి ‘గొల్లపూడి’ గుండె పగిలిపోయింది.!!

గొల్లపూడి మారుతి రావు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ఈయనను ఆ పేరుతో పిలిచే కంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని పిలవడం ఉత్తమం. కథా, నవలా, సంభాషణ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి ఇలా అన్ని రంగాలందు ఆరితేరినవారు గొల్లపూడి. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికలో ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.

1963లో వచ్చిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే గొల్లపూడి అందించారు. ఈ సినిమాకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందించింది. దీనితో పాటు ఆయన మరో మూడు నందిబహుమతులు కూడా అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందు గొల్లపూడి కథలు నవలలు నాటకాలు రాసేవారు. తెలుగు సాహిత్య అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు. రేడియో ప్రయోక్త, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా పనిచేశారు.

1980 మొదటి దశకంలో ఆయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో గొల్లపూడి అనేక చిత్రాల్లో నటించడానికి అవకాశం దొరికింది. సహాయనటుడిగా, హాస్యనటుడిగా, ప్రతికథానాయకుడిగా తరంగిణి, సంసారం ఒక చదరంగం, అభిలాష, త్రిశూలం, స్వాతి ముత్యం, యముడికి మొగుడు, అల్లుడుగారు, ముద్దుల ప్రియుడు, సైజుజీరో, మనమంతా లాంటి 250కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు.

1961 శివకామసుందరితో గొల్లపూడి వివాహం జరిగింది. వీరికి సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్ ముగ్గురు సంతానం. ఆయన సంతానంలో చివరివాడు అయినా గొల్లపూడి శ్రీనివాస్ కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే అమితమైన ఆసక్తి. దర్శకుడు కావాలన్నా ఆసక్తితో ఆయన అనేక దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి 1992 ఆగష్టు12న అజిత్, కాంచన హీరో, హీరోయిన్లుగా ‘ప్రేమపుస్తకం’ సినిమా మొదలుపెట్టారు. షూటింగ్ జరుగుతుందని, సినిమా బాగా వస్తుందని రాత్రి ఇంటికి వెళ్ళాక తన తండ్రితో చెప్పుకొని శ్రీనివాస్ మురిసిపోయేవాడు.

ఒకరోజు చిత్రీకరణ కోసం వైజాగ్ బీచ్ కి వెళ్లి అందులో హీరోయిన్ పై జరిగే చిత్రీకరణన గురించి వివరిస్తుండగా ఒక్కసారిగా పెద్ద సముద్రకెరటం వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఆ స్పాట్ లో గొల్లపూడి శ్రీనివాస్ కనిపించపోయేసరికి యూనిట్ సభ్యులంతా నిర్ఘాంతపోయారు. చాలా సేపటి తరువాత కనిపించిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ గొల్లపూడి మారుతిరావుకి కొడుకు చనిపోయిన విషయం తెలియరాలేదు. ఏదో ప్రమాదం జరిగిందని గొల్లపూడి మారుతిరావు ఆస్పత్రికి వెళ్లారు. కానీ అక్కడ తన కొడుకును ఎంత వెతికినా కనపడలేదు. అలా కనపడకపోయేసరికి ఆయన గుండె ఇంకా ఎక్కువ వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.

అలా బరువెక్కిన హృదయంతో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. అదే ఆస్పత్రి చివరిభాగం‌ ‘మార్చురీగది’లో తన కొడుకును స్ట్రెచర్ పై విగతజీవిగా చూసిన గొల్లపూడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. చిన్నప్పటినుంచి దర్శకునిగా రాణిస్తాడన్న తన కొడుకు తన కళ్లెదుటే కదలలేని విగతజీవిగా కనిపించేసరికి గొల్లపూడి బోరుమని ఏడ్చారు. ఆయనను ఓదార్చడం అక్కడున్న ఎవరివల్ల కాలేదు. కొడుకు జ్ఞాపకాల నుంచి దూరం అవడానికి ఆయనకు చాలా కాలం పట్టింది. మధ్యలో ఆగిపోయిన ‘ప్రేమపుస్తకం’ సినిమాని గొల్లపూడి మారుతిరావు పూర్తిచేసి విడుదల చేయడం జరిగింది. కొడుకు జ్ఞాపకార్థం “గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్” అవార్డును నెలకొల్పారు. సినీ రంగంలో అత్యుత్తమ నటనను కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారంగా ఈ అవార్డును అందిస్తున్నారు.