కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు మరి ఈ “అంజి” సినిమా పరాజయానికి..?!

అమ్మోరు నుంచి అరుంధతి వరకు గ్రాఫిక్స్ లేకుండా ఈ నిర్మాత ఏ సినిమా తీయలేదు. 1997 హిట్లర్ సినిమా విజయం తర్వాత స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పిలిచి మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని శ్యాంప్రసాద్ రెడ్డి తో చెప్పారు. వెంటనే శ్యాంప్రసాద్ రెడ్డి తన ఆస్థాన దర్శకుడు కోడి రామకృష్ణకు వెళ్లి విషయం చెప్పారు. అప్పుడు గ్రాఫిక్ సినిమా కంటే కమర్షియల్ సినిమాతో దాదాపు 5 కోట్ల రూపాయలు టేబుల్ క్యాష్ పొందవచ్చు. కానీ గ్రాఫిక్ సినిమా అంటే కాలం, డబ్బు అన్నీ వృధా అయిపోతాయని కోడి రామకృష్ణ చెప్పిన కూడా శ్యాం ప్రసాద్ రెడ్డి, చిరంజీవి గ్రాఫిక్ సినిమా చేద్దామని చెప్పారు.

కోడి రామకృష్ణ చేసేదేమీలేక ద్విపాత్రాభినయంతో కూడిన కథ ను పక్కన పెట్టారు. ఎమ్మెస్ ఆర్ట్స్ మూవీస్ తయారు చేసిన కథకు సత్యానంద్ మాటలు అందించారు. ముందుగా సభాపతిని దర్శకుడిగా తీసుకొని “అంజి” సినిమాలో రెండు సీన్లు, రమ్యకృష్ణతో ఒక పాటను చిత్రీకరించారు. కానీ సభాపతి టేకింగ్ సినిమా అవుట్ పుట్ బాగా లేకపోవడంతో సభాపతి స్థానంలో తిరిగి కోడి రామకృష్ణను తీసుకున్నారు. ఇక అంజి సినిమా షూటింగ్ 1997 అక్టోబర్ లో ప్రారంభమైంది. ముందుగా ఇళయరాజా, శ్రీ, రాజ్ కోటి, మణి శర్మ, విద్యాసాగర్ లను ఈ సినిమాకి సంగీత దర్శకులుగా తీసుకున్నారు. కానీ చివరికి “మణిశర్మ”ను సంగీత దర్శకునిగా తీసుకున్నారు.

ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా “టబు”ను తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత సినిమా బాగా ఆలస్యం కావడంతో టబు బాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు కమిట్ అవ్వడంతో ఆమె మధ్యలో సినిమా నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కొత్త అమ్మాయిని తీసుకుంటే సినిమా ఎన్ని రోజులైనా డేట్స్ తో ఇబ్బంది ఉండదని చివరకు నమ్రతా శిరోద్కర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. నాగబాబు వేసిన క్యారెక్టర్ ను ముందుగా శివాజీ గణేషన్ అనుకున్నారు కానీ ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం వలన తిరిగి అక్కినేని అనుకున్నారు. కానీ చివరికి ఆ పాత్రను నాగబాబు చేయాల్సి వచ్చింది.

ముందుగా రమ్యకృష్ణతో ఒక పాట చిత్రీకరణ ఆ తర్వాత వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో సెట్ వేసి కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు. 2000 సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇందులో నటిస్తున్న పిల్లలు పెద్దగా అవుతున్నారని వారితో ఉన్న కొన్ని సీన్స్ ని చిత్రీకరించారు. దాదాపు మొత్తం 400 కాల్షీట్స్ అంజి సినిమాకి చిరంజీవి ఇవ్వడం జరిగింది. 2004 జనవరి 15న సినిమా విడుదలైంది. కానీ ఊహించనివిధంగా సినిమా పరాజయం పొందింది. అంజి సినిమా పరాజయానికి కారణాలేమిటో విశ్లేషిస్తే…


1. స్టోరీ రాసుకొని దానికి అవసరానికి అనుగుణంగా గ్రాఫిక్ వర్క్ జరగలేదు. గ్రాఫిక్ వర్కు తో సినిమా చేయాలని అనుకున్నాక స్టోరీ రాసుకోవడం జరిగింది.
2. అంజి సినిమాలో స్టోరీ కంటిన్యుటీ మిస్ అవ్వడం. సీన్స్ అక్కడ అక్కడ అతికినట్టుగా కనిపిస్తూ ఉంటాయి.
3. సినిమాకి ఆయుపట్టు సంగీతం ఇందులోని ఏ ఒక్క పాట ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
4. చిరంజీవి సంవత్సరానికి ఒకసారి ఒక్కో పాటలో నటించారు. ఆయన ఫేస్ లో వేరియేషన్స్ ప్రతి పాటలో కనబడుతుంటాయి.

కథాగమనం ఒకలా ఉంటే మధ్య మధ్యలో పాటలు వస్తూ ఉంటాయి. సుదీర్ఘమైన ఆరు సంవత్సరాల కాలం పాటు అభిమానులు అంజి సినిమా కోసం వేచి ఉండడం దాంతో తీవ్రమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగి సినిమా వైఫల్యం జరిగింది.

2004 జనవరిలో ఈ సినిమాకి పోటీగా వర్షం, లక్ష్మీనరసింహ చిత్రాలు విడుదల కావడం ఆ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ పోటీలో ఈ సినిమా నిలబడలేకపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా ఈ సినిమా పరాజయానికి అనేక కారణాలున్నాయి.