ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వచ్చిన చిత్రానికి.. ఏకంగా నంది అవార్డు వచ్చిందని మీకు తెలుసా.?!

సాధారణంగా సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆ సినిమాలోని ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పుడు‌ వాటిని తొలగించడం మనకు తెలిసిందే.. కానీ ఈ‌ తతంగం కేవలం ఓ వారం ‌రోజుల వ్యవధిలో జరిగే ప్రక్రియ. ఓ సినిమా థియేటర్స్ లలో 50 రోజులు ప్రదర్శితమైన తర్వాత అందులోని సన్నివేశాలను తొలగిస్తూ కొత్తవి చేర్చడం జరిగింది.

భానుమతి నిర్మిస్తున్న అమ్మాయి పెళ్లి, ఎన్టీరామారావు నిర్మిస్తున్న తాతమ్మకల ఈ చిత్రాలకి డి.వి.నరసరాజు రచయిత. భానుమతి, ఎన్టీ రామారావు ఒక ఒప్పందంతో రెండు సినిమాల్లో నటించాలనుకున్నారు. భానుమతి పారితోషికం ఎంత అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో భానుమతి.. ఎన్టీరామారావుకిచ్చే పారితోషికంలో 5000 రూ.లు తక్కువ చేసి ఇవ్వండని చెప్పడం జరిగింది. అలా వారిద్దరి మధ్య ఉన్న ప్రతిష్టంభన తొలగినట్టయ్యింది.

1974 రామకృష్ణ సినీ స్టూడియోస్, ఎన్టీ.రామారావు దర్శకత్వంలో ‘తాతమ్మకల’ చిత్రం విడుదల అయ్యింది. ఎన్టీ రామారావు, కాంచన హీరో, హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ నటి భానుమతి గారు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు కలిసి నటించారు. పల్లెటూరి అమాయకత్వాన్ని.. పట్నం పోకడలను కళ్లకు కట్టినట్లు చూపించింది ఈ చిత్రం.

అయితే ఈ చిత్రం ప్రభుత్వ విధానాలయినా కుటుంబ నియంత్రణ, భూసంస్కరణ చట్టానికి వ్యతిరేకంగా రావడం జరిగిందని.. ఆ రోజుల్లో శాసనసభలో తీవ్ర దుమారం రేగింది. అయితే “ఒకరు ముద్దు ఆపై వద్దు” అనే ప్రభుత్వ నినాదానికి వ్యతిరేకంగా.. ఈ చిత్రంలో ఎన్టీ.రామారావు ఐదుగురు సంతానం గల తండ్రిగా నటించారు. 1971 వచ్చిన భూ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఈ చిత్రాన్ని రెండు నెలల పాటు నిషేధించింది.

తీవ్ర దుమారం పై స్పందించిన సినీ నిర్మాత, దర్శకుడు, హీరో అయినా ఎన్టీ రామారావు.. తాను కుటుంబ నియంత్రణకు, భూసంస్కరణల చట్టానికి వ్యతిరేకం కాదని, అందరూ కష్టపడి పనిచేయాలని సినిమాలో చెప్పామన్నారు. అసలు అందరూ కష్టపడి పనిచేస్తే కుటుంబ నియంత్రణ, భూసంస్కరణలు అవసరం ఉండదని తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. సినిమా నిషేధ అనంతరం ఎన్టీరామారావు, భానుమతి మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి, తిరిగి సినిమాల్లో జత చేయడం జరిగింది. ఈ సినిమాలో NT.రామారావు ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఉత్తమ కథగా‌ గుర్తించి ఈ చిత్రానికి ఏకంగా నంది అవార్డు ఇవ్వడం గమనార్హం.