నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త… 2,173 వాలంటీర్ల ఉద్యోగాలు..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిన జగన్ సర్కార్ తాజాగా రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

జగన్ సర్కార్ రాష్ట్రంలోని నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాలలో 2,173 ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ప్రాతిపదికన ఎంపిక చేసే గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ప్రభుత్వం నెలకు 5,000 రూపాయల వేతనం చెల్లిస్తుంది. https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ లో ఉద్యోగానికి సంబంధించిన పూరి వివరాలు పొందుపరిచారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా జగన్ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 211, అనంతపురం జిల్లాలో 981, చిత్తూరు జిల్లాలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నెల్లూరు జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 23 చివరి తేదీ కాగా చిత్తూరు జిల్లా అభ్యర్థులకు 25వ తేదీ, అనంతపురం జిల్లా అభ్యర్థులకు 31వ తేదీ చివరి తేదీగా ఉంది. స్థానిక గ్రామ పంచాయితీ పరిధిలో నివశించే వాళ్లను మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.