ఆన్ లైన్ లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితా.. పేరు లేకపోతే ఏం చేయాలంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 80 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాలలో జగన్ సర్కార్ అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన నగదును జమ చేస్తోంది. అమ్మఒడి స్కీమ్ కు ఎంపికైన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను విడుదల చేసింది.

రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో సైతం ప్రభుత్వం ఈ జాబితాను అందుబాటులో ఉంచనుంది. ఎవరైనా అర్హులై ఉండి ప్రాథమిక జాబితాలో పేరు రాకపోతే వాళ్లు మరోసారి అమ్మఒడి స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జగన్ సర్కార్ ఈ నెల 30వ తేదీన అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన తుది జాబితాను విడుదల చేయనుంది.

విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వం మార్పులుచేర్పులు చేయనుంది. జగన్ సర్కార్ లెక్కల ప్రకారం మొత్తం 83,72,254 మంది అమ్మఒడి స్కీమ్ ద్వారా ప్రయోజననం పొందనున్నారు. వీరిలో 72,74,674 మంది ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కాగా 10,97,580 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.

తుది జాబితాలో పేరు ఉన్నవారికి 2021 సంవత్సరం జనవరి 9వ తేదీన 15,000 రూపాయలు జమవుతుంది. విద్యార్థుల తల్లి ఖాతాలో ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుంది. https://jaganannaammavodi.ap.gov.in/ , https://studentinfo.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా అమ్మఒడి స్కీమ్ కు అర్హులో కాదో తెలుసుకోవచ్చు.