గర్భం దాల్చిన మహిళలు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలివే..!

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వారు తీసుకొనే ఆహారం నుంచి చేసే ప్రతి పని వరకు అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమది. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి డెలివరీ అయిన కొన్ని నెలల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తల్లి ,బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భందాల్చిన మహిళలు తగినన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

గర్భం దాల్చిన మహిళలు మొదటగా తాను గర్భవతి అని తెలుసుకున్న మొదటి నెల నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. ఒకేసారి అధిక మొత్తంలో ఆహారం తీసుకోకుండా వీలైనన్ని సార్లు ఆహారం తీసుకోవడం వల్ల తగినన్ని పోషకాలు శరీరానికి అంది, కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎక్కువ భాగం మహిళలు ఐరన్, క్యాల్షియం, ప్రోటీనులు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఎక్కువగా గుడ్లు, పాలు, మాంసం, చేపలు, తాజా పండ్లు కూరగాయలు,వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.

అదేవిధంగా ప్రతినెల వైద్యుని సంప్రదించి ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలి. గర్భం దాల్చిన మహిళలు వారి శరీరంలో రక్తపోటును ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైతే కొన్నిసార్లు స్కానింగ్ వంటివి చేయించుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు బరువు, ఆరోగ్య పరిస్థితి మనం తెలుసుకోవచ్చు.

గర్భం దాల్చిన మహిళలు వీలైనంతవరకు బరువైన పనులను చేయకుండా ఉండాలి. ఈ విధంగా బరువైన పనులు చేయటం వల్ల కొన్ని సార్లు గర్భస్రావమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా పగలు రెండు గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వీలైనంత వరకు మనసుకు నచ్చిన పుస్తకాలు చదువుతూ, పాటలు వింటూ గడపాలి.ఇక దుస్తుల విషయంలో గర్భం ధరించిన మహిళలు ఎప్పుడు వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ జాగ్రత్తలన్నింటిని పాటిస్తూ క్రమం తప్పకుండా మందులను వాడటం వల్ల తల్లి బిడ్డలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.