Shoban Babu – Balakrishna : ఒకే టైటిల్ తో వచ్చిన శోభన్ బాబు, బాలయ్యబాబు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో మీకు తెలుసా.?!

Shoban Babu – Balakrishna : 1970’s సావిత్రమ్మ దాదాపు రెండు దశాబ్దాల పాటు మకుటంలేని మహారాణిగా తెలుగు సినీ పరిశ్రమను ఏలారు. 1950 మొదలుకొని 1970 వరకు అటు ఎన్టీఆర్ ఇటు ఏఎన్నార్ లతో కలిసి ఆమె అనేక చిత్రాల్లో నటించారు. కానీ సావిత్రమ్మ శారీరకరీత్యా లావు కావడంతో హీరోయిన్ గా అవకాశాలు నెమ్మదిగా తగ్గాయి. తల్లి, వదిన లాంటి పాత్రలు చేయడానికి మాత్రమే అవకాశాలు వచ్చాయి. సావిత్రమ్మ 34 ఏళ్ళకే హీరోకి తల్లి పాత్రలో నటించాల్సి వచ్చింది. ఇకపోతే రెండో తరం హీరోలుగా శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలు వచ్చారు. వారికి వదినగా, తల్లిగా సావిత్రమ్మ నటించారు.

అలా 1970, రామవిజేత ఫిలిమ్స్, కె.ఎ. ప్రభాకర్ నిర్మాణం, కె. బాబురావు దర్శకత్వంలో “తల్లిదండ్రులు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో శోభన్ బాబు, హరనాథ్, చంద్రకళ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. సంక్షిప్తగా కథలోకి వెళితే సామ్యవాద భావాలుగల జగ్గయ్య తన కుటుంబానికంటే సమాజంలో ఉన్న పేదవారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

కొడుకు శోభన్ బాబు చిన్నతనంలో జరిగే ఏ పుట్టినరోజుకు జగ్గయ్య హాజరు కాకుండా.. పేద వాళ్ళతో గడుపుతాడు. సావిత్రమ్మ తన కొడుకు, కుటుంబాన్ని భర్త జగ్గయ్య పట్టించుకోవడంలేదని ఆయనకు దూరంగా వెళ్లి నివసిస్తుంది… జగ్గయ్య, సావిత్రమ్మ కొడుకు, కూతుర్లు పెరిగి పెద్దవారవుతారు. ఆ తర్వాత వారు ఎలా కలుస్తారన్నది మిగతా కథాంశం. 1970లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

“తల్లిదండ్రులు” 1991లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించాడు. దీనికి తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. వెంకటరామయ్య ( గుమ్మడి ) సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తి. కలప వ్యాపారం చేస్తూంటాడు. భార్య పద్మావతి ( జయంతి ), ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో సంతోషకరమైన ఉమ్మడి కుటుంబం అతడిది.

ఆనంద్ (నందమూరి బాలకృష్ణ), వెంకటరామయ్య చిన్న కుమారుడు. ఏ బాధ్యతలూ తీసుకోని, ఏమీ సంపాదించని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూండే జల్సారాయుడు.. అనుకోకుండా అతను ఒక పాఠశాలలో నృత్య ఉపాధ్యాయురాలిగా పనిచేసే కవిత ( విజయశాంతి)ను కలుస్తాడు. వారిద్దరూ ఒకరికొకరు పూర్తి వ్యతిరేకం. ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూంటారు. కానీ ఒక సందర్భంలో, ఆనంద్ కవితతో ప్రేమలో పడతాడు. ఆమె మాత్రం అతను తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథాంశం. 1991లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా నిలిచింది.