ఏపీకి వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. పండుగ బస్సులు లేనట్లే..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మార్చి నెల 25 నుంచి బస్సు ప్రయాణాలపై ఆంక్షలు అమలయ్యాయి. అయితే అన్ లాక్ సడలింపుల్లో భాగంగా కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగించింది. అయితే కేంద్రం అనుమతులు ఇచ్చినా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఆంక్షలను తొలగించలేదు. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చాలాసార్లు చర్చలు జరిగినా ఆ చర్చలు ఫలించలేదు.

ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏపీ నుంచి హైదరాబాద్ కు పండగ బస్సులు లేనట్లేనని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం 1,61,000 కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని చెబుతున్నా తెలంగాణ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో దసరాకు సర్వీసులు నడపడం సాధ్యం కాదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏపీకి రావాలనుకునే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పటికే టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు నడవకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. కనీసం కొన్ని సర్వీసులకైనా తెలంగాణ ఆర్టీసీ అనుమతులు ఇస్తే బాగుంటుందని ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్ – కర్నూలు రూట్లలో వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో భారీగా టికెట్ రేట్లు పెరగనున్నాయి.

కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికే ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ రేట్లను పెంచడం అంటే ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణ అంతర్రాష్ట్ర సర్వీసులపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.