మాస్క్ పెట్టుకోని వాళ్లలో అలాంటి లక్షణాలు.. బ్రెజిల్ శాస్త్రవేత్తల ప్రకటన.?

భారత్ తో పాటు ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ప్రజల్లో భయందోళనను అంతకంతకూ పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరిస్తే మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే కొందరు మాత్రం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా మాస్క్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.

తమలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉందని అందువల్ల మాస్క్ పెట్టుకోకుండా రోడ్లపై తిరిగినా తమకు నష్టం లేదని వాళ్లు వాపోతున్నారు. అయితే కుటుంబ సభ్యుల్లో ఒక్కరు మాస్క్ పెట్టుకోకపోయినా వాళ్లతో పాటు కుటుంబ సభ్యులందరికీ ప్రమాదమనే సంగతి తెలిసిందే. అయితే అన్ని విషయాలు తెలిసినా మాస్కులు మాత్రం పెట్టుకోమంటూ కొందరు తెగేసి చెబుతున్నారు. బ్రెజిల్ శాస్త్రవేత్తలు మాస్క్ లు పెట్టుకోని వారిపై అధ్యయనం చేసి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

మాస్క్ ను ధరించని వారిలో సంఘవిద్రోహ లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. యాంటీ మాస్కర్లు అయిన వీళ్లు కావాలనే భాద్యతారాహిత్యంగా వ్యవహరించి వాళ్లు కరోనా బారిన పడటంతో పాటు ఇతరులకు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారని పేర్కొన్నారు. మాస్క్ ధరించని 1,500 మందిపై పరిశోధనలు చేయగా వాళ్ల నుంచి ఎక్కువగా సామాజిక వ్యతిరేక సమాధానాలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అధికారులు మాస్క్ ధరించడం గురించి ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ తగ్గే వరకు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే మంచిదని అధ్యయనంలో పేర్కొన్నారు.