Tag Archives: Calcium levels increase

విటమిన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా.. ఈ సమస్యల బారిన పడినట్టే..?

కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ కోసం కొందరు సరైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంటే మరికొందరు విటమిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడుతున్నారు. మరి విటమిన్ ట్యాబ్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా..? కీడు చేస్తాయా..? అనే ప్రశ్నకు విటమిన్ ట్యాబ్లెట్ల వల్ల మన శరీరానికి జరిగే మంచి కంటే చెడే ఎక్కువ అని వైద్యనిపుణులు చెబుతున్నారు.

వైద్యుల సలహాలు, సూచనలను తీసుకోకుండా విటమిన్ ట్యాబ్లెట్లను వాడితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని వెల్లడిస్తున్నారు. శరీరంలో విటమిన్ల స్థాయిని పెంచుకోవడం కోసం ట్యాబ్లెట్లపై ఆధారపడితే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టేనని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెల్లడిస్తోంది. ఇష్టానుసారం విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

శరీరంలో విటమిన్ల స్థాయి పెరిగితే కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. గొంతునొప్పి, అలసట సమస్యలు వీరిని ఎక్కువగా వేధిస్తాయి. విటమిన్లు ట్యాబ్లెట్ల ద్వారా కంటే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి చేరితే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజూ కొంత సమయం ఎండలో తిరిగితే విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడిన వారిలో కాల్షియం లెవెల్స్ పెరిగి కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.

శరీరంలో విటమిన్ ఇ ఎక్కువైతే కంటి కాంతిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పప్పు దినుసులు, కూరగాయలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్నీ లభిస్తాయి. తగిన స్థాయిలో విటమిన్లు తీసుకోవడం వల్ల ఏ సమస్య లేదని విటమిన్ల స్థాయి పెరిగితే మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. మోతాదుకు మించి విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటే అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపి అవయవాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.