Tag Archives: CM Arvind Kejriwal

మాస్క్ ధరించని వారికి షాకింగ్ న్యూస్.. రూ.2000 ఫైన్…?

భారతదేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న సంగతి విదితమే. దేశంలో ప్రస్తుతం 40,000కు అటూఇటుగా కరోనా కొత్త కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.

అయితే దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో దేశంలోని ప్రజలు మాస్క్ ధరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ దేశవ్యాప్తంగా వైరస్ విజృంభించే అవకాశం ఉందని సెకండ్ వేవ్ మొదలవుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 7,400 కొత్త కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి.

రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజలు మాస్క్ ధరించకపోతే 2,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలు పూజలు, పండుగలు ఇంటి దగ్గరే జరుపుకోవాలని జనం ఒకేచోట గుమికూడితే వైరస్ ఒకరినుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. వేడుకలను రద్దు చేయడం లేదని అయితే జనం గుమికూడటాన్ని మాత్రం నిషేధిస్తున్నామని తెలిపారు.

వైరస్ వేగంగా వ్యాప్తి చెంది పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవాలని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రజలు పెద్దసంఖ్యలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఢిల్లీలో నమోదైన కేసుల సంఖ్య 5 లక్షలు దాటిందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వం భారీగా జరిమానా విధిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇకనైనా కరోనా నిబంధనలు పాటిస్తారో లేదో చూడాల్సి ఉంది.