Tag Archives: eenadu movie

Super Star Krishna : హీరోయిన్ లేదు.. డ్యూయెట్ లేదు.. హీరో కృష్ణ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారన్నారు.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.!!

Super Star Krishna : 1980 సూపర్ స్టార్ కృష్ణ మాస్ చిత్రాలతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. అప్పటికే 199 చిత్రాలలో హీరోగా నటించి తన సినీ జైత్రయాత్ర లో గుర్తుండిపోయే విధంగా 200లవ చిత్రం ఉండాలని మంచి కథ కొరకు వేచి చూస్తున్నారు. 100వ చిత్రంగా “అల్లూరి సీతారామరాజు” తన సినీ గమనాన్ని మార్చి వేయడంతో 200లవ చిత్రం కూడా అంతే విధంగా ఉండాలని భావించారు. ఆ క్రమంలో సోదరుడు హనుమంతరావు మలయాళంలో బాలన్ కే నాయర్, మమ్ముట్టిలు నటించిన “ఈనాడు” చిత్రాన్ని చూశారు. ఆయనకు బాగా నచ్చడంతో పద్మాలయ బ్యానర్ లో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.

మలయాళ చిత్రంలో హీరో ముసలివాడు కావున తెలుగులో ఆ పాత్రకి శ్రీధర్ ని ఎంపిక చేసుకున్నారు. దర్శకుడిగా సాంబశివరావును అనుకొని ఆయనకి ఈ కథ చెప్పారు. ఎందుకో సాంబశివరావుకి ఆ పాత్రకి కృష్ణగారు అయితే బాగుంటుందని అనిపించింది. ఆ విషయం కాస్త హీరో కృష్ణ కి చెప్పడంతో ఆ సినిమా చూసి హీరోకి తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని పైగా అది వయసుమళ్ళిన పాత్ర.. మాస్ చిత్రాలతో జోరుమీదున్న నన్ను ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు, తన అభిమానులు ఒప్పుకోరని చెప్పేశారు.

1980 ప్రథమార్థంలో విజయవంతమైన చిత్రాలకు కథ, సంభాషణలు అందిస్తున్న పరుచూరి సోదరులను పిలిపించి ఆ మలయాళ సినిమాని హీరో కృష్ణ చూడమన్నారు. ఆ చిత్రాన్ని చూసిన పరుచూరి సోదరులు హీరో కృష్ణకుఆ సినిమా సరిగా సరిపోతుందన్నారు. పరుచూరి సోదరులు అలా మాట్లాడడం కృష్ణకి వింతగా అనిపించింది.అందులో హీరోయిన్ లేదు పైగా వృద్ధ పాత్ర తను హీరోగా చేయడం బావుంటుందని మీరు అనడం బాగోలేదని హీరో కృష్ణ గారు అన్నారు.

కథలో మీకు తగిన కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ కొత్తగా రాస్తమన్నారు. కృష్ణ వారికి అవకాశం ఇవ్వడంతో పరుచూరి సోదరులు మలయాళ చిత్రంలోని వృద్ధపాత్రను యువపాత్రగా మలిచి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హీరో కృష్ణ ఇమేజ్ కు అనుగుణంగా కథ రాయడం జరిగింది. అది హీరో కృష్ణకు నచ్చడంతో తెలుగులో ఈ చిత్రాన్ని పునర్నిర్మించడానికి మరియు తను హీరోగా నటించడానికి ముందుకు వచ్చారు.

అలా 1982 జూన్ 9న చెన్నైలో ఈనాడు చిత్ర షూటింగ్ మొదలైంది. హీరో కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రం అంటే చాలా ఇష్టం అందుకే ఈ సినిమాలో హీరో పేరు రామరాజుగా పెట్టారు. చెన్నైలో కృష్ణ గార్డెన్స్ లో స్లమ్ ఏరియా సెట్ వేసి కొంత భాగాన్ని అక్కడ షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు, తెనాలిలో మరికొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అక్కడ సూపర్ స్టార్ కృష్ణ కి అభిమానులు ఎక్కువగా ఉండడంతో స్పెషల్ పోలీస్ ఫోర్స్ ని రంగంలోకి దించారు.

ఆ విధంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈనాడు చిత్రాన్ని చూసి ఓ హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు.. హీరో కృష్ణ ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నారని కొంత మంది సినీ ప్రముఖులు పెదవి విరిచారు. ఆ విమర్శలను సవాలుచేస్తూ 1982 డిసెంబర్ 17న “ఈనాడు” చిత్రం ఆంధ్రదేశమంతటా విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆనాటి అభ్యుదయ చిత్రాలకు ఈ సినిమా రాచబాట వేసింది.