Tag Archives: infected again

కరోనా జలుబులాంటిదే… మళ్లీమళ్లీ సోకుతుందంటున్న శాస్త్రవేత్తలు..!

ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు జలుబులా కరోనా వైరస్ కూడా వచ్చీపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వైరాలజిస్టు వెండీ బార్క్‌లే కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కు మళ్లీమళ్లీ సోకే లక్షణం ఉందని తెలిపారు.

వాతావరణంలోని మార్పుల వల్ల ప్రతి సంవత్సరం దగ్గు, జలుబు ఏ విధంగా వస్తాయో కరోనా కూడా అదే విధంగా వస్తుందని తెలిపారు. వెండీ బార్క్‌లే బ్రిటన్ లో 3.65 లక్షల మంది ప్రజలకు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడిస్తున్నామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొన్ని నెలల పాటే యాంటీ బాడీలు ఉంటాయని గుర్తించామని… యాంటీబాడీలు లేకపోతే మళ్లీ వైరస్ సోకుతుందని చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 26 శాతం మేర యాంటీబాడీలు తగ్గిపోతాయని గుర్తించామని.. వృద్ధుల్లో త్వరగా యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో 64 శాతం యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి.

మరోవైపు భారత్ లో గతంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య సగానికి తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రజలు భావిస్తున్న తరుణంలో కరోనా మళ్లీమళ్లీ సోకుతుందంటే ప్రజలకు మరిన్ని సమస్యలు తప్పవు.