Tag Archives: insulting judges

జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్.. ఆ పోస్టులపై సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు జగన్ సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు న్యాయమూర్తులకు సంబంధించి ఘాటు విమర్శలు చేశారు. అనంతరం కొందరు అధికార పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరిచే విధంగా పోస్టులు చేశారు.

కొన్ని రోజుల క్రితం ఆ పోస్టుల గురించి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు సీఐడీకి సూచించింది. అయితే సీఐడీ విచారణ సరిగ్గా చేయకపోవడంతో హైకోర్టు సీఐడీ విచారణ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై, సీఐడీ విచారణ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీకి వ్యతిరేక పోస్టుల విషయంలో సీఐడీ బాగా పని చేస్తోందని.. న్యాయమూర్తులపై పోస్టుల విచారణలో మాత్రం ఆ విధంగా స్పందించడం లేదని తెలిపింది.

అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని కోరింది. మొత్తం 19 మంది పేర్లను ఫిర్యాదు చేస్తే వారిలో కేవలం 9 మందిపై మాత్రమే కేసులు నమోదు కావడంలో అర్థమేంటని ప్రశ్నించింది. న్యాయ వ్యవస్థపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని హైకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ సీబీఐకి కేసును అప్పగించడంలో గల అభ్యంతరాలను చెప్పాలని కోరింది.

సీఐడీతో పోల్చి చూస్తే సీబీఐకు సాంకేతిక పరిజ్ఞానం, తగిన వనరులు, విభాగాలు, సిబ్బంది ఎక్కువ మంది ఉంటారని పేర్కొంది. చివరకు కేసును సీబీఐకు అప్పగిస్తున్నామని వెల్లడించింది. జగన్ సర్కార్ ఇప్పటికే పలువురు న్యాయమూర్తుల గురించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే హైకోర్టు అధికార పార్టీకి షాక్ ఇవ్వడం గమనార్హం.