Tag Archives: Intelligent SEZ Ltd.

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. 39 వేల మందికి ఉపాధి అవకాశాలు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విదితమే. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్రంలోని మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న పెట్టుబడుల ప్రోత్సాహక సహాయక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఏటీసీ టైర్లు, అదానీ డేటా సెంటర్, ఇంటెలిజెంట్ సెజ్ ప్రతిపాదనలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అధికారులు సీఎంకు పరిశ్రమలు ప్రభుత్వం నుంచి కోరుతున్న సహాయసహకారాలు, పరిశ్రమలు కోరుతున్న రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించారు. సీఎం జగన్ పరిపాలనా రాజధాని విశాఖలో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మూడు పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో 39 వేల మంది ఉద్యోగులకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రాష్ట్రానికి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 16,314 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని సమాచారం. శ్రీకాళహస్తిలో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఏర్పాటు ద్వారా 10,000 మందికి ఇదే సంస్థలో కడపలో మరో సెజ్ ఏర్పాటు ద్వారా 2,000 మందికి ఉపాధి కల్పించనుందని తెలుస్తోంది. ఏటీసీ టైర్ల తయారీ సంస్థ ద్వారా 2,000 మంది ఉపాధి పొందనున్నారని తెలుస్తోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా 24,990 మందికి ఉపాధి లభించనుందని తెలుస్తోంది.

రాష్ట్రంలో మరో మూడు పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని.. ఆ యూనివర్సిటీ ద్వారా 2,000 మందికి ప్రతి సంవత్సరం శిక్షణ ఇవ్వాలని జగన్ అధికారులు సూచించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.