Tag Archives: jamili elections

జమిలి ఎన్నికలు.. చంద్రబాబు భలే కామెడీ చేస్తున్నారే..?

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార పార్టీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏడు పదుల వయస్సులో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే నవ్వు తెప్పిస్తూ ఉండటం గమనార్హం. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు 2022 సంవత్సరంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అమలాపురం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగం అమలవుతోందని.. జగన్ రాష్ట్రాన్ని పాలించలేక చేతులెత్తేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

జగన్ వర్గం న్యాయ వ్యవస్థనే అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని.. కోర్టులపై సైతం విమర్శలు చేస్తోందని అన్నారు. జగన్ కేంద్రంతో కేసుల మాఫీ కోసమే సన్నిహితంగా మెలుగుతున్నారని వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయల సంపద అయిన అమరావతిని జగన్ సర్కార్ విధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపులకు రిజర్వేషన్ తెచ్చిందని అయితే.. వాళ్లకు జగన్ రిజర్వేషన్ ఇవ్వట్లేదని అన్నారు.

జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బీసీలలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలను సైతం జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ కు భవిష్యత్తులో గుణపాఠం చెబుతామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.