Tag Archives: laptops

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లు ఇవే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ లో భాగంగా ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. 9వ తరగతి, ఆపై తరగతులు చదివే విద్యార్థులు అమ్మఒడి స్కీమ్ ద్వారా ల్యాప్ టాప్ లను పొందే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ల్యాప్ టాప్ ల వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ల్యాప్ టాప్ లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం తెచ్చే ల్యాప్ టాప్ లకు మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుందని ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెలుస్తున్న సమాచారం ప్రకారం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే ఈ ల్యాప్ టాప్ లో 4జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్ ఉంటుందని తెలుస్తోంది. నేటి కంప్యూటర్ యుగంలో విద్యార్థులు వెనుకబడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకురానుంది. మార్కెట్ లో ఈ ల్యాప్ టాప్ ల ధర 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయల మధ్య ఉంటుంది.

అయితే ప్రభుత్వం ఈ ల్యాప్ టాప్ లను కేవలం 18,500 రూపాయలకే అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ డిగ్రీ విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ లు అందించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ల్యాప్ టాప్ ల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. తక్కువ ధరకే ల్యాప్ టాప్ లు లభిస్తూ ఉండటం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నవరత్నాల అమలులో భాగంగా అమ్మఒడి స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ గతేడాది జనవరి నెల 9వ తేదీన అమ్మఒడి స్కీమ్ లో భాగంగా 15,000 రుపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసింది. ఈ ఏడాది 14,000 రూపాయలు ప్రభుత్వం నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమైంది.. నేడు జగన్ సర్కార్ ఆ మొత్తాన్ని జమ చేసింది.

అయితే సీఎం జగన్ నేడు అమ్మఒడి స్కీమ్ అమలు కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ డబ్బులు వద్దని అనుకునే వాళ్లు ల్యాప్ ట్యాప్ ను తీసుకోవచ్చని జగన్ కీలక ప్రకటన చేశారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ చదివే వసతి దీవెన లబ్ధిదారులు ల్యాప్ టాప్ లను పొందే అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో రెండో విడత చెల్లింపులను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి స్కీమ్ ను అమలు చేస్తున్నామని.. తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. చదువుకునే వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ బడికి వెళ్లాలని.. పేదింటి పిల్లలకు మేనమామలా వాళ్లు చదువుకు దూరం కాకుండా ఆదుకుంటానని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి కూడా సీఎం జగన్ స్పందించారు.

తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని.. ఆలయ భూములను కాజేసిన వాళ్లు, గుడుల్లో క్షుద్రపూజలు చేసిన వాళ్లు ఇప్పుడు కొత్త వేషాలు కడుతున్నారని జగన్ అన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలు చేసే వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు.