Tag Archives: Muddula Mavayya

Actress Seetha : బాలకృష్ణతో సినిమా అనగానే ఎగిరి గంతేసిన సీత.. ఒక్కసారిగా అలా నిరాశపడిపోయింది.!?

తెలుగు సినీపరిశ్రమలో బాలకృష్ణ, కోడిరామకృష్ణ, గోపాల్ రెడ్డి కాంబినేషన్ కు ఎంతో పేరుంది. వీరి కలయికలో వచ్చిన మంగమ్మగారి మనవడు,ముద్దుల కృష్ణయ్య,మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలిచాయి..

1988 బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా నిర్మాత గోపాల్ రెడ్డి, కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా “ముద్దులదొంగ” చిత్రాన్ని ప్రారంభించారు. బాలకృష్ణ డేట్స్ ఇచ్చారని గోపాల్ రెడ్డి హడావుడిగా సినిమాను మొదలు పెట్టారు, కాని ఆ కథ పట్ల ఆయన ఆసక్తిగా లేరు. మొదటి షెడ్యూల్ బెంగళూరులో పూర్తి చేసుకున్నారు. ఇక రెండవ షెడ్యూల్ చెన్నై వెళ్లారు. అక్కడ గోపాల్ రెడ్డి తమిళంలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న “ఎంతంగచి పడిచావకి” చిత్రాన్ని చూశారు.

సినిమాలో సిస్టర్ సెంటిమెంటుతో ప్రేక్షకులను కట్టిపడేసే అనేక సీన్స్ ఉండడం వలన గోపాల్ రెడ్డికి బాగా నచ్చింది. ఈ సినిమాను ఎలాగైనా బాలకృష్ణ, కోడిరామకృష్ణ లకు చూపించాలని ఆయన రచయిత గణేష్ పాత్రలతో చెప్పారు. ప్రత్యేకించి ప్రింట్ తీసుకువచ్చి బాలయ్య, కోడి రామకృష్ణకు చూపించారు. సినిమా చూసిన వారిద్దరూ బాగుందనడంతో గోపాల్ రెడ్డి ఆనందానికి అవధులు లేవు. ఎలాగైనా ఈ చిత్రాన్ని రీమేక్ చేద్దామని ఆయన రీమేక్ హక్కులను కొనుక్కున్నారు.

కథ అయితే తీసుకున్నారు కానీ రచయిత గణేష్ పాత్రో దాంట్లో కొన్ని మార్పులు చేశారు. తమిళ్ ఒరిజినల్ సినిమాలో హీరో ప్లాష్ బ్యాక్ సీన్ ఉండదు. కానీ తెలుగులో ఫ్లాష్ బ్యాక్ సీను పెట్టడం జరిగింది. ఇకపోతే బాలకృష్ణకు జోడీగా విజయశాంతిని అంతకుముందే అనుకున్నారు. సినిమాకి బలమైనది హీరో చెల్లెలి పాత్ర. అందుకోసం ముందుగా హీరోయిన్స్ పూర్ణిమ,శోభన చెల్లెలి పాత్ర కోసం సంప్రదించారు. కానీ రచయిత గణేష్ పాత్రో తమిళ్ లో బిజీగా ఉన్నా హీరోయిన్ సీత పేరు చెప్పడం జరిగింది.

ఆ తర్వాత దర్శక, నిర్మాతలు ఈ సినిమా కోసం సీతను సంప్రదించారు. బాలకృష్ణతో సినిమా అనగానే సీత ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. కానీ ఆయన పక్కన హీరోయిన్ గా విజయశాంతి నటిస్తున్నారని.. చెల్లెలు పాత్ర కోసం మీరు అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు చెప్పడంతో… సీత ఒక్కసారిగా నిరాశ పడింది. బిజీగా ఉన్న సమయంలో చెల్లెలు పాత్ర చేయడం ఏంటని సీత ఆలోచించింది. కానీ బాలకృష్ణ‌ పాత్రకి ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆయన చెల్లెలి పాత్రకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని చెప్పడంతో.. సీత “ముద్దుల మావయ్య” చిత్రంలో బాలకృష్ణ చెల్లెలుగా చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే మిగతా పాత్రల్లో రాజాకృష్ణమూర్తి, ఆనంద్ రాజ్, గొల్లపూడి, ఆహుతి ప్రసాద్, హేమ, శుభలేఖ సుధాకర్ వంటి తారాగణం నటించారు.

కె.వి.మహదేవన్ స్వరపరచిన గీతాలు.. ప్రధానంగా “మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు..అనే గీతం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. 1988 అక్టోబర్ నెలలో బెంగళూర్, మైసూర్, ఊటి, చెన్నై దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ కొనసాగింది. 1989 ఏప్రిల్ 7వ తేదీన “ముద్దుల మావయ్య” సినిమా విడుదలయ్యింది. బాలకృష్ణ, విజయశాంతి హిట్ కాంబినేషన్ కావడంతో బాలయ్య అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. హీరో తన ప్రాణంగా చూసుకునే చెల్లి చనిపోతే దానికి ప్రతీకారంగా తన మేనల్లుడితో కలిసి చెల్లి చావుకు కారణమైన వారిని మట్టుపెట్టడం.. ప్రేక్షకుల మనసును ఎంతగానో కట్టివేసింది.

ఈ చిత్రంలో చెల్లి చనిపోయినప్పుడు వర్షం పడుతుంది. అది చూసిన హీరో పాడే మీద తన చెల్లి తడవ కూడదని గొడుగు అడ్డుపెట్టడం.. బ్యాక్ గ్రౌండ్ లో విషాదకరమైన బిట్ మ్యూజిక్ రావడంతో ప్రేక్షకులు ఆపుకోలేని కన్నీటిబొట్లు నేలరాలాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్,సావిత్రి అన్నాచెల్లెలుగా నటించిన రక్తసంబంధం చిత్రం కంటే బాలకృష్ణ, సీత అన్నాచెల్లెలి గా నటించిన “ముద్దుల మావయ్య” చిత్రానికే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. గోపాల్ రెడ్డి ఈ సినిమా నడుస్తున్న సమయంలో ప్రతివారం పేపర్స్ లో సినిమా గురించి యాడ్స్ వేయడం.. లేదా ఈ చిత్రం గురించి ఒక ఆర్టికల్ రాయడం లాంటి కొత్త ప్రచార పద్ధతులను అవలంభించారు. చెల్లెలు సెంటిమెంట్ తో వచ్చిన ముద్దుల మావయ్య చిత్రం 1989లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.