Tag Archives: online admissions

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆన్ లైన్ అడ్మిషన్లపై స్టే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఇంటర్ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇంటర్ కు ఆన్ లైన్ లో అడ్మిషన్లు చేయాలంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. విద్యాశాఖ ఆన్ లైన్ లో అడ్మిషన్లను చేపట్టడానికి గల కారణాలను వెల్లడించాలని.. ఏ నిబంధనలను అనుసరించి విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందో చెప్పాలని హైకోర్టు కోరింది.

ఆన్ లైన్ అడ్మిషన్ల గురించి దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు విద్యార్థులకు ఛాయిస్ లేకుండా కాలేజీలలో ప్రభుత్వమే సీట్లను కేటాయించడాన్ని తప్పుబట్టింది. ఏ కాలేజీలో విద్యార్థులు చేరాలనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని వారికే వదిలేయాలని తెలిపింది. విద్యార్థుల భవిష్యత్ పై ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రభావం పడిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను వినిపించారు.

ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ తరపు లాయర్ ఆన్ లైన్ అడ్మిషన్ల వల్ల విద్యార్థి సరైన గ్రూపును ఎంచుకోలేడని.. అడ్మిషన్ల సమయంలో కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థికి ఏ గ్రూప్ ఇష్టమో తెలుసుకోవచ్చని.. ఆన్ లైన్ అడ్మిషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మరింత సమయం కావాలని హైకోర్టు లాయర్ వాదించారు.

హైకోర్టు ఆన్ లైన్ అడ్మిషన్లపై స్టే విధించగా కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 10వ తేదీలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగలగా తాజాగా ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయానికి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.