Tag Archives: Oxygen

ఆక్సిజన్ కొరతతో కేవలం ఒక్కరు మాత్రమే మరణించారు.. కేంద్రం వెల్లడి..

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను విడిచారు. కరోనా సెకండ్ వేవ్ లో ఆ మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఆక్సిజన్ కొరతతో చాలామంది చనిపోయారని మనం వార్తా పత్రికల్లో.. మీడియాల మొన్నటి వరకు చాలానే విన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో మరణించింది కేవలం ఒక్కరు మాత్రమే అంటూ ప్రకటించింది.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు తమకు అందిన వివరాల ప్రకారం ఒక రాష్ట్రంలోనే ఆక్సిజన్‌ కొరత కారణంగా ఒకరు మరణించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ రాష్ట్రం పేరును మాత్రం ఆయన బయట పెట్టలేదు. మిగిలిన రాష్ట్రాల్లో అలాంటి మరణాలు సంబవించలేదంటూ కేంద్రానికి తెలిపాయని అతను వెల్లడించారు.

పార్లమెంట్ లో అంతకముందు ఆక్సిజన్‌ కొరత కారణంగా సంభవించిన మరణాలను వెల్లడించాలంటూ కొంతమంది అడిగిన ప్రశ్నకు వివరాలను తెప్పించుకొని ఇలా మీడియా ముందు అగర్వాల్ వెల్లడించారు. ఈ ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారి వివరాలను ఈ నెల 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరగా.. అయితే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు 13 రాష్ట్రాలు వివరాలను సమర్పించినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఆక్సిజన్ కొరత కారణంగా పంజాబ్ లో కోవిడ్ మరణాలు చాలా చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై రాజకీయ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆక్సిజన్ అందక చాలామంది చనిపోయారని.. వారి వివరాలను వెల్లడించడంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తున్నాయి. ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులు పడుతుంటే.. ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే.