Tag Archives: tender process

ఆరోగ్య శ్రీ విషయం మరో శుభవార్త చెప్పిన జగన్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ విషయంలో రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే నెల 13వ తేదీ నుంచి 2,000 వ్యాధులకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని భవిష్యత్తులో మరిన్ని వ్యాధులను జాబితాలో చేర్చే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్య శాఖలో నాడు నేడు పనుల గురించి సమీక్ష నిర్వహించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరాలకు అనుగుణంగా వైద్య ప్రక్రియలను చేపడతామని వెల్లడించారు.

అధికారులను నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ, పనులకు సంబంధించిన పూర్తి వివరాల గురించి జగన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు సీఎం జగన్ కు నాడు నేడు కింద చేపట్టే పనుల కోసం 17,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని… వైద్య కళాశాలల్లో చేపట్టే పనులకు 5,472 కోట్ల రూపాయలు అదనంగా అవసరమని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ సచివాలయాలను హెల్త్‌ క్లినిక్‌లు‌ అందుబాటులోకి వచ్చేంత వరకు ఆరోగ్య శ్రీ రెఫరల్ పాయింట్లుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ రాష్ట్రంలో కొత్తగా ప్రజలకు అందుబాటులోకి రాబోతున్న వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ లు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణాల గురించి అధికారులతో చర్చించారు. మచిలీపట్నం, పులివెందుల, పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల నిర్మాణాలకు వచ్చే నెలలోగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.

నంద్యాల, మార్కాపురం, బాపట్ల, అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం కాలేజీలకు టెండర్లు పిలవాలని చెప్పారు. రాజమహేంద్రవరం, పెనుకొండ, అమలాపురం, ఆదోని, విజయనగరంలలో జనవరిలో టెండర్లు పిలవాలని తెలిపారు.