Tag Archives: Village and ward volunteers

గ్రామ వాలంటీర్లకు షాకింగ్ న్యూస్.. వారిని తొలగించనున్న జగన్ సర్కార్..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్ల దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వీరికి 5,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతున్నాయి. అయితే తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డ్ వాలంటీర్లను తొలగించాలని అధికారులను ఆదేశించింది. జగన్ సర్కార్ రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు చేయడానికి అర్హులని పేర్కొంది. ఎవరైనా ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాల వయస్సు దాటితే వాళ్లు విధులకు దూరం కావాల్సి ఉంటుంది.

అయితే రాష్ట్రంలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగంలో చేరినట్లు తేలడంతో ప్రభుత్వం వారిని తొలగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగంలో చేరడానికి 18 సంవత్సరాల వయస్సు ఉండాలి కానీ కొందరు విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగంలో చేరారు. దీంతో 18 సంవత్సరాల లోపు ఉన్న వాలంటీర్లను, 35 సంవత్సరాల వయస్సు దాటిన వాలంటీర్లను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 2.70 లక్షల మంది గ్రామ, వార్డ్ వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అర్హులు కాని వారిని తొలగించమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే తొలగింపు ప్రక్రియను ప్రారంభించారని సమాచారం.