Tag Archives: when schools start in AP

ఏపీలో పాఠశాలల ప్రారంభం అప్పుడే.. సెలవులు తగ్గించిన సర్కార్..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే వైరస్ భయం తగ్గినా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇప్పటికే కరోనా, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో జగన్ సర్కార్ నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరిచేందుకు సిద్ధమవుతోంది. విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం అకడమిక్ క్యాలండర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.

దాదాపు ఐదు నెలల పనిదినాలు తగ్గడంతో జగన్ సర్కార్ అందుకు అనుగుణంగా సిలబస్ ను తగ్గించేందుకు కసరత్తు చేస్తుండటం గమనార్హం. అదే సమయంలో విద్యార్థులకు పండగ సెలవులను తగ్గించి ఉపాధ్యాయుల సెలవులపై కూడా పరిమితిని విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. నవంబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే పాఠశాలలు ఏప్రిల్ 30 వరకు పని చేయనున్నాయి.

వారానికి ఆరు పని దినాలు ఉండే విధంగా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2020 ఏప్రిల్ నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉపాధ్యాయులు నెలకు రెండున్నర రోజుల సెలవు దినాలను మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ సిలబస్ తగ్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సిలబస్ తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.

విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఇకపై పాఠశాలల హాజరు పట్టికలో కులం, మతం వివరాలు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినీవిద్యార్థుల పేర్లను ఒకే రంగు సిరాతో రాయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో పాటించిన విధానాలను ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.