రుణాలు తీసుకున్న వాళ్లకు కేంద్రం శుభవార్త.. వారికి ఊరట..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో రుణాలు తీసుకున్న వాళ్లకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం వడ్డీ మినహాయింపుకు సంబంధించి తాజాగా కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గతంలో లోన్ మారటోరియం ప్రయోజనం కల్పించిన సంగతి తెలిసిందే.

ఎవరైతే లోన్ మారటోరియం పొంది ఉంటారో వాళ్లు ఆరు నెలల లోన్ మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే వడ్డీపై వడ్డీ భారాన్ని మోయనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నేడు వడ్డీపై వడ్డీ మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 2 కోట్ల రూపాయలకు మించని రుణాలకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.

ఎం.ఎస్.ఎం.ఈ రుణాలు, వెహికిల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు తీసుకున్న వారికి కేంద్రం నిర్ణయం వల్ల భారం తగ్గనుంది. కస్టమర్ల లోన్ అకౌంట్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు, బ్యాంకులు వడ్డీ డబ్బులను జమ చేస్తాయి. సుప్రీం కోర్టు కేంద్రాన్ని త్వరగా వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించగా కేంద్రం దసరా పండుగ కానుకగా రుణాలు తీసుకున్న వాళ్లకు శుభవార్త తెలిపింది.

మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు లోన్ మారటోరియం కాలానికి కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం వడ్డీ మాఫీ కానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల లెక్కల ప్రకారం కేంద్రం నిర్ణయం వల్ల 6,500 కోట్ల రూపాయల అదనపు భారం కేంద్రంపై పడనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వరకు లోన్లు తీసుకున్న వారికి మాత్రమే ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.