కన్నకొడుకు ప్రవర్తన నచ్చక ఆస్తిని కుక్కకు రాసిచ్చిన తండ్రి!

సాధారణంగా తాతలు, తండ్రి సంపాదించిన ఆస్తి తరతరాలుగా వారి వారసులకు చెందుతుందని ఎంతోమంది వీలునామాలు రాయడం మనం చూస్తుంటాం. అంతేకాకుండా మరికొందరు సంతానం లేని వారు వారి యావదాస్తిని తమ తోబుట్టువులకు, లేదా అనాధ శరణాలయాలకు రాసి ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా తన ఆస్తిలో సగభాగాన్ని తన భార్య పేరిట, మిగిలిన సగం ఆస్తిని శునకానికి రాసి ఇవ్వడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయణ అనే వ్యక్తి తన పెంపుడు శునకం (జాకీ) అంటే ఎంతో ఇష్టం. అయితే అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తన కుమారుడి ప్రవర్తన నచ్చక అతనిపై కోపంతో ఆ తండ్రి ఏకంగా తన ఆస్తిలో సగభాగాన్ని తను పెంచుకున్న పెంపుడు శునకానికి రాసిచ్చాడు. అంతే కాకుండా మిగిలిన సగభాగాన్ని తన రెండవ భార్య అయిన చంపా వర్మ పేరు పై రాసి ఇచ్చారు. ఈ విషయం పై నారాయణ మాట్లాడుతూ, తన భార్య, తన పెంపుడు శునకం తనను ఎంతో బాగా చూసుకుంటున్నాయని అందుకే నా ఆస్తిని మొత్తం వారిద్దరి పేర్లపై రాశానని తెలిపారు.

ఆస్తి వారి పేరుపై రాయడమే కాకుండా నేను చనిపోయిన తర్వాత నా శునకాన్ని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో వారికి జాకీ పేరు మీదుగా రాసిన ఆస్తికి వారసులు అవుతారని, నారాయణ వీలునామాలో రాశారు. అయితే కన్నకొడుకు ప్రవర్తననచ్చక ఆస్తిని తన పెంపుడు శునకానికి రాసి ఇవ్వడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కొడుకు పై కోపంతో ఆస్తిని కుక్కకు రాసి ఇవ్వడం విడ్డూరమని తమదైన శైలిలో స్పందిస్తున్నారు.