‘అన్నమో రావణా’.. తీవ్ర ఆహార సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలు రూ.1195

పురాణాల్లో రామాయణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో శ్రీలంకను రావణుడు పాలించినట్లుగా మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ప్రస్తుతం రావణుడేలిన ఆనాటి బంగారు రాజ్యంలో.. నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆహార సంక్షోభంలో చిక్కుకుపోయి.. అన్నమో రావణా అంటూ ఘోషిస్తున్నారు. నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నాలుగువైపులా నీటితో కప్పబడి ఉన్న ప్రాంతాన్ని ద్వీపం అంటాం. శ్రీలంక చుట్టూ కూడా మొత్తం నీటితోనే ఉంటుంది.

అందుకే శ్రీలంక దేశాన్ని ద్వీప దేశం అంటారు. అక్కడి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసర పదర్థాల ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం. దీంతో అక్కడ కిలో పాల ప్యాకెట్ ధర దాదాపు ఐదు రెట్లు పెరిగి రూ.1195గా ఉంది. అంతేకాకుండా అక్కడ వంట గ్యాస్ ధర కూడా ఏకంగా 90 శాతం పెరిగి రూ.2,657కు వచ్చింది.

అంతకు ముందు రూ.1400 ఉండేది. అంటే దాదాపు రూ.1257 పెరిగింది. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. దిగుమతులపై శ్రీలంక ప్రభుత్వ నిషేధం విధించడంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర ప్రభావం పడింది.

ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. ధరలపై నియంత్రణ తీసుకురావడంతో అక్రమ నిల్వలు పెరిగి మార్కెట్లో సరఫరా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది.