విద్యార్థుల కష్టాలు తీర్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. ఒక్క ట్వీట్ తోనే..

బస్సులపై అసభ్యకర పోస్టర్లు అంటించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే.. వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఇలా అతడు చేస్తున్న కార్యక్రమాలతో మర్పు స్పష్టంగా కనపడుతోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలకు వీసీ సజ్జనార్ నాంది పలికారు. ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కడికైనా వెళ్లాలంటూ.. బస్సులను బుక్ చేసుకునే వెసులు బాటును కూడా కల్పించారు. అంతేకాకుండా పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్‌ను బుక్‌ చేసుకుంటే.. నూతన వధూవరులకు కానుకలు అందిస్తున్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు, ప్రయాణికులను ఆక‌ట్టుకునేందుకు సజ్జనార్‌.. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు. తాజాగా మరో సమస్యకు పరిష్కారం చూపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న సమస్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి ట్వీట్ చేసింది.

విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు వీడియో తీసి పంపించారు. ఆ ట్వీట్ కు ఎండీ వెంటనే స్పందించి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత డిపో అధికారులకు ఆదేశించాడు. వెంటనే వారి కి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. దీనితో 200 మంది విద్యార్థులకు ఉపశమనం కలిగినట్లు అయింది. దీంతో అతడికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.