నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ నటి విజయశాంతి రెండు రోజుల క్రితం బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చిన విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 1998 సంవత్సరం నుంచే తెలంగాణ కోసం పోరాడానని.. బీజేపీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేస్తే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తనను వ్యతిరేకించిందని అమె అన్నారు.

ఆ తరువాత తెలంగాణ కోసం తాను బీజేపీని వీడి తల్లి తెలంగాణ అనే పార్టీని పెట్టానని కేసీఆర్ కు ఆ సమయంలో మంత్రి పదవి దక్కకపోవడంతో తెలంగాణ ఉద్యమంలోకి ఆయన వచ్చారని తెలిపారు. కేసీఆర్ తనను పార్టీలో కలుపుకోవాలని అప్పట్లో చాలా ప్రయత్నాలు చేశాడని.. పార్టీ కోసం తాను బాగా కష్టపడుతున్నానని కేసీఆర్ చెబితే తనకు నవ్వొచ్చిందని ఆమె అన్నారు. తాను ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి కేసీఆర్ తనను లేకుండా చేయాలని చూశాడని చెప్పారు.

తాను బీజేపీ పార్టీలో ఉన్న సమయంలో సోనియా గాంధీ మీద పోటీ చేయాలని తనకు కేసీఆర్ సూచించాడని.. కేసీఆర్ గురించి గతంలో వైఎస్సార్ ను కలిసి తాను వివరించానని అన్నారు. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళితే తన మనుషులతో కేసీఆర్ బూతులు తిట్టించాడని.. కేసీఆర్ కావాలనే తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. తాను ఒక్కడే ఎదగాలనే స్వార్థంతో కేసీఆర్ అలా చేశాడని చెప్పారు.

తనకంటే కేసీఆర్ గొప్ప నటుడని ఆయన మాటలు నమ్మి తల్లి తెలంగాణ పార్టీని ఆయన పార్టీలో కలిపేశానని ఆమె చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తన దగ్గరకు వస్తానని చెప్పి లక్ష రూపాయలు లేవనే కారణంతో రాలేదని.. ఇప్పుడు మాత్రం కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించాడని కామెంట్లు చేశారు.