తన శత్రువుకు బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ కథ ఇవ్వబోతున్న బాహుబలి రచయిత..!

టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ చిత్రాల రచయితగా, దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి కె వి విజయేంద్ర ప్రసాద్. బాహుబలి సినిమాతో ఆయనకి బాహుబలి రచయిత అనే ట్యాగ్ పెట్టేశారు. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథల్లో ఎక్కువగా ఆయన తనయుడు రాజమౌళి తెరక్కెకిస్తున్నవే ఉండటం విశేషం. జానకి రాముడు సినిమాతో రచయితగా మారిన విజయేంద్ర ప్రసాద్ బొబ్బిలి సింహం, బంగారు కుటుంబం, ఘరానా బుల్లోడు, సరదా బుల్లోడు, సమర సింహారెడ్డి లాంటి చిత్రాలకి కథలు అందించారు. ఈ సినిమాలకి దర్శకులు వేరే వారు.

అయితే స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి సింహాద్రి సినిమా నుంచి తండ్రి రాస్తున్న కథలకే దర్శకత్వం వహిస్తున్నారు. అలా తండ్రీ కొడుకులైన విజయేంద్ర ప్రసాద్ – రాజమౌళి కాంబినేషన్‌లో సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి -ది బిగినింగ్, బాహుబలి- ది కన్‌క్లూజన్ లాంటి చిత్రాలు వచ్చాయి. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. బాహుబలి రెండు భాగాలతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. అంతేకాదు ఇప్పుడు తెలుగులో పాన్ ఇండియన్ కథలు, సినిమాలు రూపొందుతున్నాయి అంటే అందుకు కారణం విజయేంద్ర ప్రసాద్ – రాజమౌళి అని ఖచ్చితంగా చెప్పాల్సిందే.

విజయేంద్ర ప్రసాద్ తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోనూ తన కథలతో భారీ విజయాలను అందిస్తున్నారు. హిందీలో మణికర్ణిక, భజరంగీ భాయ్ జాన్ సినిమాలకి కథలు ఆయనే అందించారు. ఈ రెండు కథలతో హిందీలో తెరకెక్కిన మణికర్ణిక, భజరంగీ భాయ్ జాన్ భారీ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నాయి. ఇక ఇటీవల పాన్ ఇండియన్ రేంజ్‌లో అమ్మ జయలలిత బయోపిక్‌గా వచ్చిన తలైవి చిత్రానికి కథ అందించింది విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం. తమిళ, తెలుగు, హిందీ భాషలలో విడుదలైన తలైవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

కాగా విజయేంద్ర ప్రసాద్ – రాజమౌళి కాంబినేషన్‌లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియన్ సినిమాగా తయారవుతోంది. అయితే ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ 2017లో వచ్చిన విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ కథను సిద్దం చేశారట. కానీ ఈ కథ తన కొడుకు రాజమౌళికి ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయి ఆ తర్వాత మహేశ్ బాబుతో రాజమౌళి మరో సినిమా పూర్తి చేసేవరకే ఎంత కాదన్న 3 ఏళ్ళు పడుతుంది. అందుకే విక్రమార్కుడు సీక్వెల్ కథ తన శత్రువు అంటూ సరదాగా చెప్పే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు.

పూరి జగన్నాథ్‌లా స్పీడ్‌గా సినిమా తీసే సత్తా మరే దర్శకుడికీ లేదని విజయేంద్ర ప్రసాద్ అంటుంటారు. ఇక పూరి స్పీడ్‌కి ఆయన ఫిదా. చిన్న సందర్భం నుంచి కూడా పాట కావాలంటే పాట, ఫైట్ కావాలంటే ఫైట్ క్రియేట్ చేయగలడని, అందుకే పూరి అంటే నాకు బాగా ఇష్టమని చెబుతుంటారు. అలాంటి ఫేవరట్ డైరెక్టర్‌కి విక్రమార్కుడు సీక్వెల్ కథ ఇవ్వడం అంటే ఆయనకి ఆనందమే. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాగా మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో ‘విక్రమార్కుడు’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ఒకటి అని తెలిసిందే. ప్రేక్షకులు ‘జింతాతా జితా జితా .. ‘ అనే రవితేజ మేనరిజాన్ని ఇప్పటికీ వాడుతుంటారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించి తన గ్లామర్‌తో బాగా ఆకట్టుకుంది.