పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..!!

సాధారణంగా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్లే పిల్లలు నిత్యం జబ్బుల బారిన పడుతూ ఉంటారు. వర్షాకాలం, శీతాకాలంలో పిల్లలను జ్వరం, దగ్గు, జలుబు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే పిల్లలు ప్రతిరోజూ ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటే తక్కువగా రోగాల బారిన పడతారు. పిల్లలకు ప్రతిరోజూ క్యారెట్లను తినిపించాలి. క్యారెట్ల ద్వారా విటమిన్ ఎ, జింక్ సమృద్ధిగా లభిస్తాయి.

బాదం, పిస్తాపప్పు, జీడిపప్పు, నట్స్ ఇమ్యూనిటీని పెంచి పిల్లలు బలంగా తయారయ్యేలా చేస్తాయి. జీడిపప్పు, పిస్తాపప్పు రోజూ తినే పిల్లలకు సంపూర్ణ పోషణ లభించడంతో పాటు వాళ్లు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. నిమ్మ జాతికి చెందిన పండ్లు సైతం పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. చిన్నారులు వారంలో ఒకసారైనా నారింజ, బత్తాయి లాంటి పండ్లను తీసుకోవాలి.

ఈ పండ్ల ద్వారా పిల్లలకు వాళ్ల శరీరానికి అవసరమైన సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో వాళ్లు జ్వరం, దగ్గు, జలుబుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. పిల్లలకు ఖచ్చితంగా తినిపించాల్సిన ఆహార పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడంలో పెరుగు సహాయపడుతుంది.

పిల్లలకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కంగా ఉండే ఆహారాన్ని అందించాలి. ఇడ్లీ, రాగి జావ, బ్రెడ్ లను బ్రేక్ ఫాస్ట్ గా ఇవ్వడంతో పాటు లంచ్ లో చపాతీ లేదా అన్నం, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పాలు, పల్లీలు, గుడ్లు, అరటిపండ్లు కూడా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.