బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుందో తెలుసా? ఆ తప్పులు చెయ్యడం వల్లే తలనొప్పులు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ కూడా వెంటాడుతోంది.కరోనా నుంచి కోలుకొని బయటపడిన వారిలో బ్లాక్ ఫంగస్ తీవ్రరూపం దాలుస్తోంది.బ్లాక్ ఫంగస్ కారణంగా ఎంతో మంది కంటిచూపును కోల్పోతున్నారు. మరి కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఉన్నఫలంగా కరోనా బాధితులలో బ్లాక్ ఫంగస్ ఏర్పడడానికి గల కారణాలు ఏమిటని పరిశోధకులు అధ్యయనాలు ప్రారంభించారు.

ఈ అధ్యయనంలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వీపీ పాండే బ్లాక్ ఫంగస్ రోగులపై అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా 100% బాధితులు యాంటీబయాటిక్స్‌ తీసుకున్నట్లు అధ్యయనంలో తేలిందనే విషయాన్ని రాజీవ్‌ జయదేవన్‌ అనే వైద్యుడు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

కరోనా సోకిన సమయంలో కరోనా నుంచి విముక్తి పొందడం కోసం అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్లే కరోనా నుంచి కోలుకున్న తరువాత వారిలో బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని ప్రొఫెసర్ పాండే తెలిపారు. మధుమేహ సమస్యలతో బాధపడేవారిలో ఎక్కువ భాగం స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ కి దారితీస్తుందని తెలియజేశారు.

కరోనా మహమ్మారి బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, కార్బాపెనెమ్స్‌ వంటి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అధికస్థాయిలో పెరిగిందని, ఈ విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగడానికి గల కారణం యాంటీబయాటిక్స్ కారణమని జయదేవన్‌ అభిప్రాయపడ్డారు.