ఏపీలో కొత్తరకం కరోనా కలకలం.. భయాందోళనలో ఆ జిల్లా ప్రజలు..?

కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని అనుకునే లోపు కొత్తరకం కరోనా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. యూకే నుంచి ఏపీకి వచ్చిన మహిళకు తాజాగా కరోనా నిర్ధారణ అయింది. అయితే సదరు మహిళకు సాధారణ కరోనా సోకిందా లేక కొత్తరకం కరోనా సోకిందా తెలియాల్సి ఉంది. యూకే నుంచి ఒక మహిళ ఢిల్లీకి రాగా అధికారులు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ మహిళను క్వారంటైన్ కు తరలించారు.

అయితే క్వారంటైన్ నుంచి తప్పించుకున్న మహిళ ఏపీ ఎక్స్ ప్రెస్ ద్వారా రాజమండ్రికి వచ్చింది. ఢిల్లీ అధికారులు ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు ఆ మహిళను, మహిళ కుమారుడిని గుర్తించి రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆమె బ్లడ్ శాంపిల్స్ ను పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపడానికి చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రాజమండ్రి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అధికారులు సైతం అప్రమత్తమే కరోనా వైరస్ విషయంలో చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ వెబ్ పోర్టల్‌ లో వివరాలను నమోదు చేసుకుంటే మాత్రమే బ్రిటన్ నుంచి ఏపీకి వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో 21 వేల బృందాల ద్వారా బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి సంబంధించిన వివరాలను సేకరిస్తోందని అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ డెస్కుల సహాయంతో అధికారులు పరీక్షలు నిర్వహించి కరోనా సోకిన వారి వివరాలను సేకరిస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా నెగిటివ్ వచ్చినా 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.