YS Avinash Reddy : అవినాష్ కోసం పెద్ద తలను రంగంలోకి దింపిన జగన్.. ఇప్పుడు కూడా ‘సారీ’యేనా.. వైఎస్ భారతికి లైన్ క్లియర్ అయ్యిందా..!?

YS Avinash Reddy : టైటిల్ చూడగానే ఇదేంటి అని అనుకుంటున్నారా.. మీరు చూసింది.. విన్నది అక్షరాలా కరెక్ట్.. అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ కాకూడదని చేస్తున్న ప్రయత్నాలు ఏ రేంజ్‌లో ఉంటున్నాయో ఊహించడం కష్టమని ఏపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు నా సొంత బాబాయ్ నీ ఎందుకు చంపుకుంట.. పోనీ నా తమ్ముడికి ఏం పని..! అసలు ఆ అవసరం లేదు.. అని చెప్పుకొచ్చిన జగన్.. ఈ మధ్య సీబీఐ దూకుడుతో.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆ వ్యవహారంపై పూర్తిగా సైలెంట్ అయ్యారు.. ! ఇప్పుడు జగన్ ఏం మాట్లాడినా కూడా ప్రతిపక్షం వేసే ప్రశ్నలకు చెప్పేందుకు సమాధానం లేదు. అందుకే సైలెంట్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..! ఒక వైపు ప్రతిపక్షం.. మరోవైపు వ్యతిరేక మీడియా దుమ్ము దులిపి వదులుతోంది..! ఈ సమయంలో ఆయనకున్నది ఒక్కటే మార్గం.. అవినాశ్‌ అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం. ఇప్పుడదే చేస్తున్నారు. ఒకవేళ కాపాడుకున్నారనుకోండి.. ఈసారి కూడా కడప బరిలో ఆయన సతీమణి భారతికి మరోసారి సారీ చెప్పి అవినాశ్‌కే టికెట్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

రంగంలోకి పరిమళ్ నత్వానీ..

బాబాయ్‌ వివేకాని చంపలేదని జగన్ అంటుండగానే మరో బాబాయ్ భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యాడు.. దీంతో పెద్ద తల నొప్పి వచ్చి పడింది.. ఇక అవినాష్‌ను సైతం అరెస్ట్ చేస్తే పార్టీ పరువు గంగలో కలుస్తుంది అని జగన్ భయపడుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఆ విషయంపై తన ఫోకస్ అంతా పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ కుమార్ స్వామిజీని రంగంలోకి దింపారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా పరిమళ్ నత్వానీని సైతం రంగంలోకి దింపారంటూ ప్రచారం జరుగుతోంది. పరిమళ్ ఎవరో ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు.. అంబానీకి బిజినెస్ వ్యవహరాలు చూసుకునే వ్యక్తి.. అంబానీకి నమ్మిన బంటు .. పెద్ద తలకాయే.. ఇప్పుడు ఈయన ద్వారా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని టాక్ నడుస్తోంది. అటు కేంద్రాన్ని.. ఇటు సుప్రీంకోర్టును ప్రభావితం చేస్తున్నారని బయట టాక్ నడుస్తోంది. ఈ సమయంలో మరోవైపు అవినాష్‌రెడ్డి సైతం ఇక మీదట కామ్‌గా ఉండబోనంటూ నిన్న ఒక వీడియో విడుదల చేశారు.

సీబీఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదు?

ఒకరకంగా అవినాష్ రెడ్డి సీబీఐ విచార‌ణ తీరునే తప్పుబట్టారు. తనపై ఎన్ని విమర్శలొచ్చినా ఇప్పటి వరకూ వివేకాతో పాటు ఆయన కూతురు అల్లుడిపై కొన్ని విషయాలు మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివేకా క్యారెక్టర్‌ను చాలా నీచంగా చిత్రీకరించింది అవినాష్ రెడ్డి కాదా? అని విపక్షాలు అంటున్నాయి. ఇక అంతకు మించిన దారుణమైన విషయాలు ఏముంటాయని ప్రశ్నిస్తున్నాయి. వివేకా హత్య కేసులో ఆయ‌న రాసిన లేఖ‌ కీలకమని అవినాష్ రెడ్డి తెలిపారు. అలాంటి లేఖను ఎందుకు దాచారని అడిగితే.. రాజశేఖర్‌రెడ్డి చెప్పిన సమాధానం హాస్యాస్పదమన్నారు. ఇక ఇవన్నీ పక్కనబెడితే వివేకా లేఖపై సీబీఐ ఎందుకు ఫోకస్‌ చేయడం లేదో అర్ధం కావడం లేదన్నారు. పైగా ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఏకంగా సీబీఐపైనే విమర్శలు గుప్పించడమనేది చర్చనీయాంశంగా మారింది.

అవినాష్ అరెస్ట్ అవకుంటే పరిస్థితి ఏంటి?

ఇక ఇప్పుడు హైలైట్ అవుతున్న ప్రధానాంశం.. అవినాష్ అరెస్ట్ అయితే కడప పార్లమెంట్ ఇన్‌చార్జిగా వైఎస్ భారతికి జగన్ అప్పగించే యోచనలో ఉన్నారనేది ఇప్పటి వరకూ జరుగుతున్న ప్రచారం. మరి జగన్ ప్రయోగిస్తున్న అస్త్రాలన్నీ పని చేసి ఒకవేళ అవినాష్ అరెస్ట్ అవకుంటే పరిస్థితి ఏంటి? భారతికే కడప ఎంపీ టికెట్ ఇస్తారా? లేదంటే మళ్లీ సారీ చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జగన్.. అవినాష్‌ని నిలబెడితే మాత్రం పరిస్థితులు ప్రతికూలంగా మారతాయని భావిస్తే మాత్రం భారతికి టికెట్ కేటాయించడం ఖాయం. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సుప్రీంకోర్టును ప్రభావితం చేసే పరిస్థితి ఉందా? అనేది. అది జరగని పని న్యాయ నిపుణులు అంటున్నారు. అవినాష్ అరెస్ట్‌పై ఒకవైపు బెట్టింగ్ కాస్తుండగా.. మరోవైపు భారతి అభిమానులు.. అనుచరులు మాత్రం ఆయన అరెస్ట్ అయితే తమకు, తమ వదినకు మంచి రోజులు వస్తాయని.. పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అని ఆనందపడుతున్నారని టాక్. ఇక చూడాలి ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. ఏంటో..!