YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష. ఒకప్పుడు జగన్ తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో అయినా ఆయనకు కొందరు రాజకీయ ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎంతమంది నిలుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 అసెంబ్లీ.. 4 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇంతటి దారుణ పరాజయం వైసీపీ పెట్టిన తర్వాత ఇదే తొలిసారి. కాబట్టి ఇప్పుడు జగన్‌కు ఇది అత్యంత కష్టకాలం. ఆయన లైఫ్‌లో వరస్ట్ డేస్ తిరిగి రాబోతున్నాయనడంలో సందేహమే లేదు. జగన్ ఎందుకు ఓటమి పాలయ్యారనే విషయాలను పక్కనబెడితే ఆయనతో నిలిచేదెవరనేదే ఆసక్తికరం. వైసీపీ తరుఫున గెలిచిన వారంతా జగన్‌తో ఉంటారా? అనేది ప్రశ్నార్థకమే. వీరిలో ఎందరు ఉంటారో.. ఎందరు పక్క చూపు చూస్తారో తెలియదు. మొత్తంగా జగన్ జీరో అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.

ఇదే అసలు సిసలైన పరీక్ష..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అధికారం కావాలి. అధికారాన్ని అనుభవించేందుకు అలవాటు పడిన వ్యక్తి అది లేకుండా ఒక్క క్షణం కూడా నిలవలేడు. ఇది లోక రీతి. ఈ లెక్కన చూస్తే జగన్ జీరో అయినా ఆశ్చర్యం లేదు. అలాగే కేసులు కూడా జగన్ మెడ చుట్టూ చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ కూడా లేకుంటే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన సైతం గెలిచిన నేతలకు ఉండొచ్చు. కాబట్టి వారంతా వైసీపీలోనే కొనసాగుతారని భావించడం తప్పే అవుతుంది. ఇప్పటి వరకూ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ.. ఎంపీలు కానీ తాడేపల్లి వైపు కూడా తిరిగి చూడలేదని టాక్. కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్‌ పార్టీకి దక్కలేదు. జగన్‌కు ఇంతకు మించిన దారుణ పరిస్థితి ఉండదేమో. ఇదే అసలు సిసలైన పరీక్ష. దీనిని జగన్ ఎలా దాటుతారు? ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలుస్తారా? జీరోతో తన జీవితాన్ని మళ్లీ మొదలు పెడతారా? లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్టుగా లండన్ వెళ్లి పోయి వ్యాపారాలు చూసుకుంటారా? ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంది.

సహకరించే వారేరి?

నిన్న మొన్నటి వరకూ జగన్‌కు అండగా ప్రధాని మోదీ ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబును కాదని మోదీ సైతం జగన్‌కు సాయం చేయలేరు. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎలాంటి సాయాన్ని వైసీపీ పొందలేదనడంలో సందేహమే లేదు. ఇప్పుడు జగన్ సమస్యల వలయంలో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. అంతెత్తు ఎగిసి నేలకు చేరిన కెరటం. తిరిగి అదే స్పీడుతో కాకున్నా ఆలస్యంగానైనా లేస్తారా? లేదంటే పత్తా లేకుండా పోతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పట్టుదల ఉండొచ్చు కానీ సహకరించే వారేరి? నడిసంద్రంలో ఉన్నారు. ఒడ్డుకు చేర్చే నావ కోసం ఎదురు చూస్తున్నారు. గెలిచిన నేతలే తాడేపల్లి వైపు చూడటం లేదంటే.. ఓడిన నేతలు చూస్తారన్న నమ్మకం కూడా లేదు. కొంతమంది అయితే జగన్‌తో ఉండొచ్చు. వారికి కూడా వేరే దిక్కు లేదు కాబట్టి. అసలు జగన్‌ను ముంచిందే వారు కదా.. వారితో కలిసి పార్టీని పైకి లేపడమంటే సాధ్యమయ్యే పనేనా? ఏమో.. ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.