దాసరి 150వ సినిమా.. బాలకృష్ణతో మొదటి సినిమా.. బాక్స్ఆఫీస్ కు షాక్ ఇచ్చిన వైనం.!!

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దమనకాండను పంటి బిగువున నిలిపి, తెల్లదొరల ‌అకృత్యాల పురిటి నొప్పులతో, రక్తాశ్రువులు చిందిస్తూ.. భారతావని చీకటిని చీల్చుకుంటూ.. 1947 ఆగస్టు15న స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షను నెరవేరుస్తూ.. భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. దేశభక్తి ప్రధానాంశంగా దాసరి ఓ కథ రాసుకున్నారు.

1980, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్, క్రాంతి కుమార్ నిర్మాణం దాసరి నారాయణరావు దర్శకత్వంలో “సర్దార్ పాపారాయుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీదేవి, హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో ఎన్టీరామారావు ద్విపాత్రాభినయం చేశారు. బ్రిటిష్ కాలం నాటి కథతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నరనరాన దేశభక్తిని నింపింది.

అలాగే 1982 వడ్డే రమేష్ నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో “బొబ్బిలి పులి” చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో తిరిగి ఎన్టీరామారావు, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. భారత సైన్యంలో పనిచేసిన ఒక సైనికాధికారి, తన తల్లి మరణించిందని తెలిసి ఇంటికి వస్తాడు. ఆ క్రమంలో సమాజంలో జరిగే అక్రమాలు, అకృత్యాలను చూసి తట్టుకోలేక వాటిపై అతను పోరాడతాడు. ఈ సినిమా దేశభక్తి ప్రధానాంశంగా కొనసాగుతోంది. బొబ్బిలి పులి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

2011 సి.కళ్యాణ్ నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో “పరమవీరచక్ర” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ, అమీషా పటేల్, నేహాదూపియా హీరో, హీరోయిన్లుగా నటించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు 150వ చిత్రంగా ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందింది. మణి శర్మ స్వరపరిచిన బాణీలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆనాడు అన్న గారితో దేశభక్తి ప్రధానాంశంగా తీసిన రెండు చిత్రాలు ‌బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కానీ దాసరి నారాయణరావు, బాలకృష్ణకు వచ్చేసరికి కొంత తడబడ్డాడని చెప్పవచ్చు. తండ్రితో హిట్టు.. కొడుకుతో ఫట్టు.. అన్నట్టుగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది.