“నారప్ప”చిత్రంలో చిరంజీవి నటించిన ఆ సినిమాలోని పాటనే ఎందుకు తీసుకున్నారో మీకు తెలుసా..?!

డి.రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ లో మొదటగా రాముడు భీముడు, శ్రీకృష్ణ తులాభారం లాంటి చిత్రాలను వరసగా ఎన్టీ రామారావుతో తీశారు. ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమ్ నగర్, సెక్రెటరీ లాంటి సూపర్ హిట్ చిత్రాలను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత సోగ్గాడు, దేవత లాంటి చిత్రాలను శోభన్ బాబుతో తీసి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఇదంతా 1970 వ దశకంలో సురేష్ ప్రొడక్షన్స్ వారి విజయదుందుభిగా పేర్కొనవచ్చు.

1980 వచ్చేసరికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, భానుచందర్ లాంటి యువరక్తం సినీపరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ వారు 1983 వరకు కూడా అదే సీనియర్ హీరోలతో విజయవంతమైన చిత్రాలను తీశారు. ఇదే సంవత్సరం మెగాస్టార్ చిరంజీవికి ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. ఎందుకంటే సంయుక్త ప్రొడక్షన్స్ లో ధనుంజయ రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మాణంలో, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దసరా కానుకగా “ఖైదీ” అనే చిత్రం విడుదలై అనూహ్య విజయాన్ని సాధించి, ఈ సినిమా చిరంజీవి కెరీర్ కి ఒక పూల బాట వేసిందని చెప్పుకోవచ్చు.

అప్పటికి టాప్ స్టార్స్ అంతా ఆశ్చర్యపోయేలా చిరంజీవి పాటలు, ఫైట్లు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్స్ అంతకు ముందు, ఆ తర్వాత గాని చిరంజీవితో సినిమాలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఖైదీ సినిమా విడుదల అనంతరం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం, మురళీ మోహన్ రావు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, నలిని హీరో, హీరోయిన్లుగా “సంఘర్షణ” అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1983 డిసెంబర్ 29న విడుదలై విజయవంతం అయ్యింది. ఈ సినిమాకి చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు.

‘సంఘర్షణ’ చిత్రంలోని పాటలన్ని ప్రేక్షకులను ఆహ్లాదపరిచేలా ఉన్నాయి. చిరంజీవి నటించిన సినిమాల్లోని “టాప్ టెన్” సాంగ్స్ లలో సంఘర్షణ సినిమా మాలోని ఏ ఒక్క పాట లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన చిత్రం కాబట్టి “నారప్ప” చిత్రంలో “కట్టు జారి పోతా ఉంది చీర కట్టు జారి పోతా ఉంది..” అనే సంఘర్షణ సినిమాలోని పాటను ఒక సన్నివేశంలో పెట్టారు. దీనితో మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో నారప్ప సినిమా పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.