1988 లో దొంగ-పోలీస్ గా వచ్చిన ఈ ఇద్దరు హీరోల చిత్రాలలో ఎవరు నెగ్గారు.. ఎవరు తగ్గారు..?!

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రేక్షకులకు సినిమాల పండగ వచ్చిందని మురిసిపోతారు. అలా ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోలు సైతం పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు విజయవంతం అవుతాయి మరికొన్ని సినిమాలు పరాజయం పొందుతాయి. అయితే చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు రెండూ కూడా సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద బరిలో నిలిచాయి.

సరిగ్గా 1988 జనవరి 14న దేవివరప్రసాద్ నిర్మాణంలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన మంచి దొంగ చిత్రంలో చిరంజీవి, విజయశాంతి, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించారు. ఒక్క రోజు తేడాతో 1988 జనవరి 15న అనిల్ బాబు, హరికృష్ణ నిర్మాణంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రంలో బాలకృష్ణ విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు.

ఈ రెండు చిత్రాలకు కామన్ పాయింట్స్ మూడు ఉన్నాయి. ఎమ్ వి ఎస్ హరనాథ్ రావు ఈ రెండు చిత్రాలకు మాటలు అందించారు. అలాగే ఈ రెండు చిత్రాల్లో విజయశాంతి హీరోయిన్ గా నటించింది.ఈ రెండు చిత్రాలకు చక్రవర్తి సంగీతాన్ని అందించారు. కాకపోతే చిరంజీవి నటించిన మంచి దొంగ చిత్రం పూర్తిగా సమాజంలో ఒక దొంగ అతని చుట్టూ జరిగే రాజకీయ అన్యాయాలను అరికడుతూ ముందుకు వెళ్లే దొంగ పాత్రలో ఆయన నటించారు. అలాగే సమాజంలో అన్యాయాన్ని అరికట్టే ప్రభుత్వ అధికారిగా ఇన్స్పెక్టర్ పాత్రల్లో బాలకృష్ణ నటించారు.

కానీ రెండు సినిమాల్లోని పాత్రల్లో హీరోల లక్ష్యం ఒకటే సమాజంలో కుళ్లు కుతంత్రాలు తొలగించి పేదవారికి న్యాయాన్ని అందించడమే. అంతకుముందు అనిల్ బాబు ఎన్టీ రామారావు గారి సలహాతో బాలకృష్ణ వద్దకు వెళ్లి ఆయనతో సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పారు. అప్పుడు బాలకృష్ణ బిజీగా ఉన్నప్పటికీ అనిల్ బాబు కి డేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చిత్రానికి నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు.

మొదటగా ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రానికి ఏ.కోదండరామి రెడ్డి ని దర్శకుడిగా అనుకున్నారు కానీ అనిల్ బాబు కి ముత్యాల సుబ్బయ్యతో మంచి స్నేహం ఉండటం వలన ఆయనకు అవకాశం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రానికి ముత్యాల సుబ్బయ్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు. అలా సంక్రాంతి బరిలో దిగిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ విజయాన్ని సాధించింది. 1985లో కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన చట్టంతో పోరాటం చిత్రాన్ని దేవి వరప్రసాద్ నిర్మించడం జరిగింది.

ఆ సినిమా విజయవంతం అవడంతో తిరిగి చిరంజీవితో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచి దొంగ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. చక్కటి కథను రాఘవేంద్రరావు అందించగా ఎమ్. వి.ఎస్ హరనాధ రావు సంభాషణలు రాశారు. చిరంజీవి నటన, రాఘవేంద్రరావు దర్శక ప్రతిభ మంచి దొంగ సినిమాని విజయం వైపు తీసుకు వెళ్ళాయి. 1988లో సంక్రాంతికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు విజేతలుగా నిలిచారు.