ఏపీ ప్రజలకు అలర్ట్.. ఓటిపీ చెబితేనే రేషన్ పంపిణీ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటికి చేరే విధంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ త్వరలో రేషన్ ఇంటికి పంపిణీ చేసే విధంగా సరికొత్త విధానం అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై మొబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తే సరుకులు ఇంటికి చేరతాయి.

ఇప్పటివరకు రాష్ట్రంలో రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరగగా 2021 సంవత్సరం జనవరి 1 నుంచి వాహనాల ద్వారా రేషన్ ను సరఫరా చేయనున్నారు. ఎంఎల్ఎస్‌పీ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు వచ్చిన సరుకులను వాలంటీర్లు వాళ్లకు కేటాయించిన ఇళ్లకు పంపిణీ చేస్తారు. అయితే రేషన్ పొందాలంటే రేషన్ కార్డు లబ్ధిదారుడు కార్డుతో మొబైల్ నంబర్ ను లింక్ చేసుకొని ఉండాలి.

రేషన్ తీసుకునే సమయంలో మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా వాలంటీర్లు సీరియల్ నంబర్ ప్రకారం రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నారు. 2021 సంవత్సరం జనవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ప్రతి రేషన్ కార్డుదారుడి మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు నమోదు చేస్తే మాత్రమే సరుకుల పంపిణీ జరగనుందని తెలుస్తోంది. నూతన విధానం ద్వారా రేషన్ లో అక్రమాలను సులభంగా అరికట్టవచ్చు.

జగన్ సర్కార్ కొన్ని నెలల క్రితం నుంచే ఈ విధానం అమలు కోసం ప్రయత్నాలు చేయగా వివిధ కారణాల వల్ల ఈ విధానం అమలు వాయిదా పడుతూ వస్తోంది. జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నూతన నిర్ణయాలను, విధానాలను అమలులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం.