ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చినెల చివరి వారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు. అన్ని పార్టీల నుంచి అభిప్రాయం కోరి ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 28వ తేదీన ఎన్నికల కమిషనర్ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించన్నారు.

విజయవాడ నగరంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీలతో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వంతో పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత ఎన్నికల విషయంలో అడుగులు ముందుకు పడనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే నిధులు విడుదల అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ గతంలో ఎన్నికలను వాయిదా వేయడంతో జగన్ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించింది.

ఆ తరువాత నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డారు. ఈ నెల 28వ తేదీన జరగబోయే మీటింగ్ తరువాత ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి సహకారం అందేలా ఆదేశాలు జారీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ పిటిషన్ విచారణ సమయంలో ప్రభుత్వ తరపు లాయర్ ఎన్నికల కమిషన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కోరలేదని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది నిమ్మగడ్డ రమేష్ కు హైదరాబాద్ లో సైతం అధికార నివాసం ఉన్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్‌లో అధికార నివాసం, విజయవాడలో మరో నివాసం ప్రభుత్వ ధనం వృథా అవుతుందని వ్యాఖ్యానించింది.