కొవిడ్‌-19కు ఆయుర్వేద టీకా.. త్వరలోనే ప్రజలలోకి?

దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే పలు కంపెనీలు వ్యాక్సిన్ ను కని పెట్టాయి. ఈ క్రమంలోనే కరోనాను అరికట్టడం కోసం ఆయుర్వేద టీకాను ఆవిష్కరించడంలో నిమగ్నమైన మెగాల్యాబ్‌కు రూ.300 కోట్ల నిధులు లభించాయి. ముంబై కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న మెగాల్యాబ్‌ ఆయుర్వేద వైద్య విధానాలను అనుసరించి కరోనాకు రెండు డోస్ ల టీకా కనుక్కునే పనిలో నిమగ్నమయ్యారు.

ఆయుర్వేద వైద్య విధానంలో కొవిడ్‌-19 టీకా వచ్చే ఆరు నెలల్లో విడుదల చేస్తామని, ఈ టీకాను ఇంజక్షన్ల రూపంలో లేదా ముక్కులో,నోటిలో వేసుకొని చుక్కల రూపంలో తయారు చేసే ప్రయత్నం జరుగుతోందని పూర్వవిద్యార్థుల మండలి అధ్యక్షుడు రవి శర్మ వివరించారు. ఈ టీకా కనుగొన్న తరువాత మొదటగా ఐఐటీ పూర్వవిద్యార్థులకు అందిస్తామని రవి శర్మ తెలిపారు.

మెగాల్యాబ్‌ చేపట్టిన ఈ పరిశోధనలో అమెరికాకు కనెక్టికట్‌కు చెందిన బయోటెక్నాలజీ నిపుణుడు డాక్టర్‌ అరిందమ్‌ బోస్‌ నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆయన ఫైజర్‌లో టీకా తయారీ విభాగానికి అధిపతిగా పని చేస్తున్నారు. ఐఐటి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ శాంతారామ్ కానే ఇంజక్టబుల్‌ అడ్జువంట్‌ ఆయుర్వేదం నోటిలో,ముక్కులో వేసుకుని చుక్కలు తయారుచేసే విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు.

కేవలం వచ్చే ఆరు నెలల వ్యవధిలోనే ఈ కరోనా వైరస్ కు ఆయుర్వేద టీకాను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు రవి శర్మ తెలిపారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టీకా, చుక్కలను ఆరు నెలల్లో మార్కెట్లోకి అందుబాటులోకి తేనుందని మెగా ల్యాబ్ పేర్కొంది.ఐఐటీ అలూమ్ని ప్రపంచంలోని అతిపెద్ద పూర్వవిద్యార్థుల సంస్థ కావటం ప్రత్యేకత. దీన్లో 23 ఐఐటీలకు చెందిన విద్యార్థులు ఉండటం మరొక ప్రత్యేకత అని చెప్పవచ్చు.